చికిత్స పొందుతున్న రోగులను పరామర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఐవీ రెడ్డి
గిద్దలూరు:నగర పంచాయతీలోని కొత్తపల్లె గ్రామంలో రోజురోజుకూ అతిసార విజృంభిస్తూ కలకలం రేపుతోంది. బుధవారం 45 మందికి పైగా అతిసార సోకడంతో వైద్యశాలకు పరుగులు తీశారు. అందిన వివరాల మేరకు సోమవారం గ్రామంలో జరిగిన శ్రీరామనవమి సందర్భంగా భక్తులు అందరూ వారి గృహాల్లోనే బెల్లం పానకం తయారు చేసుకున్నారు. ఆ పానకంను ఆలయం వద్ద ఏర్పాటు చేసిన డ్రమ్ముల్లో కలిపి అందరూ కలిసి పూజలు చేసిన అనంతరం ప్రజలకు పంచిపెట్టారు. అదే రోజు సాయంత్రం ఒకరిద్దరికి వాంతులు, విరేచనాలు కావడంతో పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్సలు చేయించుకుని వెళ్లారు. మంగళవారం ఒక్కొక్కరికి పెరుగుతూ ఎనిమిది మందికి చేరింది. ఇలా మూడోరోజు అతిసార బాధితులు 45 మందికి చేరారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు, నంద్యాలల్లోని వైద్యశాలలకు తరలించారు. వీరిలో బలగాని కేశమ్మను కర్నూలు, చంద్రకళ, త్రివేణి, మరో బాలుడిని నంద్యాలకు తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు.
గిద్దలూరు వైద్యశాలలో మరో 10 మంది..
అతిసార వ్యాధితో ప్రజలకు వాంతులు, విరేచనాలు ఎక్కువయ్యాయి. మండలంలోని క్రిష్ణంశెట్టిపల్లె ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యులు రెండు రోజులుగా వైద్యశిబిరం ఏర్పాటు చేసినా ప్రయోజనం కనిపించకపోవడంతో కొందరిని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 30 మందికి పైగా స్థానికంగానే చికిత్సలు పొంది కాస్త ఉపశమనం కనిపించడంతో ఉండిపోయారు. పట్టణంలోని పలు ప్రైవేటు వైద్యశాలల్లో మరికొందరు చికిత్సలు పొందుతున్నారు.
అతిసార సోకిన వారిలో పోతల శ్రీనివాసులు, బలగాని చైతన్య, సునీత, కమతం రమేష్, పాలుగుళ్ల రామనారాయణరెడ్డి, కుక్కా లింగమ్మ, బోగాని స్వప్న, మారుడి సాయిచరణ్‌రెడ్డి, పి.సావిత్రి, గోలం లక్ష్మీదేవి, తాటిచర్ల అంకమ్మలు మూడో రోజు అస్వస్థతకు గురికాగా, మంగళవారం నుంచి జానా క్రిష్టఫర్, చక్కా కోటయ్య, అండ్రా ఆనందరావు, కాతా దీపిక, జానా మౌనిక, బందెల స్వేత, బి.చిన్నసుబ్బయ్యలు వైద్యం పొందుతున్నారు.
కలుషిత నీటి వలనే అతిసార...
గ్రామానికి తాగునీటి అవసరాలు తీర్చేందుకు సమీపంలో ఉన్న కుంటలో బోరు తవ్వించి పైపుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామం ఎత్తు పల్లాలుగా ఉండటం వల్ల వీధులన్నింటికీ నీరు ఎక్కాలన్న ఉద్దేశ్యంతో వాల్వ్‌లు ఏర్పాటు చేశారు. వాల్వ్‌ల ద్వారా లీకైన నీరు పక్కనే గుంతగా ఏర్పడి మురుగు తయారైంది. విద్యుత్ సరఫరా లేని సమయంలో మోటారు పనిచేయనప్పుడు వాల్వ్ పక్కనే ఉన్న మురుగునీరంతా పైపుల్లో చేరి తిరిగి నీరు వదిలినప్పుడు కుళాయిలకు చేరుతోంది. ఆ నీటిని పానకంలో కలపడం, పానకం తీయగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ కారకాలు పెరిగి అతిసార కలిగించాయని గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామాన్ని సందర్శించిన ఆర్డీఓ పంచల కిషోర్, నగర పంచాయతీ కమిషనర్ కృష్ణమూర్తి, తహశీల్దారు పి.కాదర్‌వలిలు వాల్వ్‌లను పూడ్పించి పైపులు అమర్చారు. బ్లీచింగ్, సున్నం చల్లించి శుభ్రం చేశారు.
క్రిష్ణంశెట్టిపల్లె, రాజుపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారులు ఎం.రమీజాభాను, కే.శ్రీలక్షీ, పీపీ యూనిట్ వైద్యులు సాయిప్రశాంతి, వైద్య, ఆరోగ్య సిబ్బంది గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు.
రోగులకు నాయకుల పరామర్శనగర పంచాయతీలోని కొత్తపల్లెలో అతిసార వ్యాధితో బాధపడుతూ చికిత్సలు పొందుతున్న రోగులను వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయికల్పనారెడ్డిలు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మెరుగైన వైద్యం కోసం తమ సహాయసహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సలు పొందుతున్న వారిని పరామర్శించారు. అక్కడి వైద్యాధికారి డాక్టర్ సూరిబాబుతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు టీడీపీ నాయకులు రోగులను పరామర్శించారు. డాక్టర్ బి.వి.రంగారావు, కమిషనర్ కృష్ణమూర్తి, తహశీల్దారు కాదర్‌వలి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ వీరబ్రహ్మం, వీఆర్వో శ్రీనివాసరెడ్డిలు గ్రామంలో పర్యటించారు.
Comments
Please login to add a commentAdd a comment