తొలి సంతకం నిర్వచనం తెలుసా నీకు?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తెలుగుదేశంపార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు తొలి సంతకం అనేదానికి నిర్వచనం తెలుసా? అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, త్రిసభ్య కమిటీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వేదికపైనే ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేస్తే అది మరుసటి రోజు నుంచే అమలైందని గుర్తుచేశారు. కేంద్రాన్ని ఒప్పించి మరీ రుణమాఫీ చేయించారన్నారు.
చంద్రబాబు మాత్రం రుణమాఫీపై తొలి సంతకం అంటూనే కోటయ్య కమిటీని వేశారని దుయ్యబట్టారు. ఆరునెలలైనా ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని చెప్పారు. రుణమాఫీ చేస్తామంటూ రైతులను, డ్వాక్రా మహిళలను మోసగించి, పంట బీమా కూడా దక్కకుండా చేసిన టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ ఐదున కలెక్టరేట్ల ఎదుట తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
క్యాడర్ వైఎస్సార్‌సీపీవైపే ఉందని, సీనియర్ల నేతృత్వంలో పార్టీని పటిష్టం చేస్తామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం జిల్లా విస్తృతస్థాయి సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు సాగి దుర్గాప్రసాదరాజు సహా పలువురు నేతలు పాల్గొన్నారు.