‘అంగన్‌వాడీ’లకు అద్దె కష్టాలుడ
Published Fri, Oct 18 2013 1:55 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : అంగన్‌వాడీ కేంద్రాలను అద్దె కష్టాలు వెంటాడుతున్నాయి. కేంద్రాలు నిర్వహిస్తున్న ఇళ్లకు ఆరు నెలలుగా అద్దె చెల్లించకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు ఇళ్ల యజమానుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖాళీ చేయాలని మరికొందరు సూచిస్తుండడంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు. అద్దె విషయం అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ ప్రాజెక్టు పరిధిలో 332 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో 308 కేంద్రాలు నడుస్తున్నాయి. 254 కేంద్రాలు అద్దె భవనాల్లో, 54 సొంత భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న 122 కేంద్రాలూ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మొత్తంగా రూరల్, అర్బన్ ప్రాజెక్టుల పరిధిలో 376 కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయి. వీటికి అద్దె సక్రమంగా చెల్లించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఇటు సూపర్‌వైజర్లు, సీడీపీవోలు, పీడీ పట్టించుకోవడం లేదు.
జీవో అమలైన నాటి నుంచి అద్దె బంద్
అంగన్‌వాడీ కేంద్రాల అద్దె పెంచుతూ ప్రభుత్వం జనవరి 17న జీవో నం. 62/కె1/2013 జారీ చేసింది. ఏప్రిల్ నుంచి అమలు చేయాలని జీవోలో పేర్కొంది. గతంలో అర్బన్ అంగన్‌వాడీ కేంద్రాల అద్దె రూ.700 ఉండగా రూ.3వేలకు, రూరల్ పరిధిలో రూ.200 ఉండగా రూ.750కి పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికీ జీవో అమలు కావడం లేదు. అద్దె డబ్బుల కోసం కార్యకర్తలు నిత్యం అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
పెద్ద భనవాలు తీసుకోవాలట..!
ప్రస్తుతం ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను ఖాళీ చేసి రెండు మూడు గదులతో ఉన్న భవనాలు అద్దెకు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నట్లు సమాచారం. కరెంటు బిల్లు, పెరిగిన నిత్యావసరాల ధరల నేపథ్యంలో ఐసీడీఎస్ నుంచి ఇచ్చే అద్దె ఏ రకంగానూ సరిపోదని కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అర్బన్ పరిధిలో ఒక్కో గది అద్దె రూ.2వేలు ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇల్లు ఖాళీ చేస్తే అద్దె ఇల్లు దొరకని పరిస్థితి నెలకొంది. మూడు గదులు, 600 చదరపు అడుగులతో భవనాలు కావాలంటే కష్టమని అంటున్నారు. కొందరు కార్యకర్తలు ఇళ్ల యజమానుల బాధలు భరించలేక అప్పు చేసి చెల్లించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న భవనాలకే అద్దె పెంచి ఇవ్వాలని కోరుతున్నారు.
తిప్పలు పడుతున్నం
ఆరు నెలలుగా అంగన్‌వాడీ కేంద్రాల అద్దె ఇవ్వడం లేదు. ఇంటి యజమానితో తిప్పలు పడాల్సి వస్తంది. అధికారులకు చెప్పినా పట్టించుకుంట లేరు. నన్ను ఒక కేంద్రానికి ఇన్‌చార్జిగా నియామించారు. దీంతో రెండు భవనాల అద్దెకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
- కె.మంజూల, అంగన్‌వాడీ కార్యకర్త
జీవో అమలైత లేదు
అంగన్‌వాడీ కేంద్రాల అద్దె పెంచుతూ జనవరిలో జారీ చేసిన జీవో అమలైత లేదు. సూపర్‌వైజర్లను అడిగితే నిధులు లేవని చెబుతున్నరు. నిధులున్నా ఇవ్వకుండా తిప్పలు పెడుతున్నరు. అద్దె అందకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నం. మా బాధలు పట్టించుకునే వారే లేరు.
- షిరాజాహ, అంగన్‌వాడీ కార్యకర్త
ఇల్లు ఖాళీ చేయమంటున్నరు
అద్దె చెల్లించకపోవడంతో ఇల్లు ఖాళీ చేయమని యజమానులు ఒత్తిడి చేస్తున్నరు. డబ్బులు నెలనెలా ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నయి. ప్రస్తుతం పెరిగిన ధరలకు ఇంత తక్కువ అద్దెకు రెండు మూడు గదులు ఉన్న ఇల్లు దొరకవు కదా.. ఇచ్చే వారు కూడా లేరు.
- ఎస్.మనీషా, అంగన్‌వాడీ కార్యకర్త
అధికారులు నిర్లక్ష్యం వీడాలి
కేంద్రాల అద్దె చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలి. సొంత భవనాలు లేక రూ.700 అద్దెతో కేంద్రాలు నడుపుతున్నం. కొన్ని సందర్భాల్లో సొంతంగా అద్దె చెల్లించాల్సి వస్తంది. ఆరు నెలలుగా కష్టంగా ఉంది. ఏప్రిల్ నుంచి పెరిగిన అద్దె చెల్లించాలి.
- కళావతి, అంగన్‌వాడీ కార్యకర్త
Advertisement
Advertisement