రావెల చుట్టూ అసమ్మతి ఉచ్చు | Disagreement with the noose around ravela | Sakshi
Sakshi News home page

రావెల చుట్టూ అసమ్మతి ఉచ్చు

Published Sat, Nov 21 2015 12:44 AM | Last Updated on Wed, Aug 29 2018 7:45 PM

రావెల చుట్టూ అసమ్మతి ఉచ్చు - Sakshi

రావెల చుట్టూ అసమ్మతి ఉచ్చు

మంత్రి రావెల వైఖరిపై   మండిపడుతున్న ప్రజాప్రతినిధులు
నియోజకవర్గంలోని  కార్యక్రమాలకు సహాయనిరాకరణ
ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని బాహాటంగా విమర్శలు
రెండు వర్గాలు విడిపోయిన   వట్టిచెరుకూరు మండలం
జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్‌తో    సైతం విభేదాలు

 
రాష్ట్ర మంత్రి రావెలకు అసమ్మతివర్గం తలపోటుగా తయారైంది. తన సొంత నియోజకవర్గం ప్రత్తిపాడులోనే నాయకులు వేరు కుంపటి పెట్టటం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నియోజకవర్గ కేంద్రంలో తన అనుయాయులు అనుకుంటున్న వారు సైతం అసంతృప్తిగా ఉండడం ఆయనకు మింగుడుపడని అంశంగా మారింది. సెగ్మెంట్ అభివృద్ధి సమావేశంలో ఓ మహిళా నేత సీరియస్‌గా హెచ్చరించడం ఆయనపై ఉన్న ఆగ్రహానికి అద్దం పట్టింది.
 
గుంటూరు  రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబుపై మండల ప్రజాప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ నేతలకు  పదవులు ఇప్పించే విషయంలో మంత్రి  ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. నియోజకవర్గంలోని ఐదింట మూడు మండలాల్లో ఈ వ్యతిరేకత తీవ్రంగా ఉంటే నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో మంత్రి వ్యవహార శైలి ఆశాజనకంగా లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు.  ఇకపై పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారో చూస్తామంటూ ఒకరిద్దరు మండల ప్రజాప్రతినిధులు హెచ్చరించారు. మరో వైపు అసమ్మతినేతల కుంపటికి పార్టీలోని మిగిలిన నేతలు మద్దతు పలుకుతూ రావెలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు.

మంత్రి వ్యతిరేక వర్గం సహాయ నిరాకరణ...
మంత్రి రావెల వైఖరిని ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు, కాకుమాను, గుంటూరు రూరల్  మండలాల జెడ్పీటీసీలు బాహాటంగా వ్యతిరేకిస్తున్నారు. వట్టిచెరుకూరు మండల అధ్యక్ష  పదవి విషయంలో రావెలకు మండల నాయకులకు మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. పార్టీకి పనిచేసిన సీనియర్ నాయకుడు డొక్కలపూడి శ్రీహరిని కాదని  అప్పటి వరకు ఆ పదవిలో ఉన్న షేక్ హసన్ మాస్టారునే కొనసాగించడం వివాదంగా మారి మండలం రెండు వర్గాలుగా విడిపోయింది. మంత్రి వ్యతిరేక వర్గం నేతలు పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరవుతూ సహాయ నిరాకరణ చేస్తున్నారు. గురువారం మండలంలోని  ఇంజనంపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ప్రారంభోత్సవ సమయంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకోగా, మంత్రి తన వ్యతిరేక వర్గంపై పోలీస్ పవర్‌ను వినియోగించి ఓ కార్యకర్తను అదు పులో ఉంచే విధంగా చేశారు. ఇది కార్యకర్తలకు మరింత ఆగ్రహాన్ని కలిగించింది.

 చాపకింద నీరులా....
 కాకుమాను జెడ్పీటీసీగా ఎన్నికై జిల్లాపరిషత్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జానీమూన్ కూడా రావెల పట్ల ఎడముఖం, పెడముఖంగా ఉన్నట్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గతంలో కాకుమాను ఎంపీడీవో పావులూరి బాలమ్మను బదిలీ చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్ పట్టుబట్టగా, అందుకు  మంత్రి ససేమిరా అనడంతో ఎంపీడీవో అక్కడే కొనసాగుతున్నారు. దీంతో అసమ్మతి పైకి కనిపించకపోయినప్పటికీ, చాపకింద నీరు లా పాకుతోందని ప్రజలు చెబుతున్నారు. దీనికితోడు చైర్‌పర్సన్ జానీమూన్ మంత్రి పుల్లారావు సూచనల మేరకు నడుచుకుంటున్నారని, పాలనాపరమైన అంశాల్లో జానీమూన్ పుల్లారావు సూచనలు, ఆదేశాలు పాటిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.
 
రూరల్‌లో తిరుగుబావుటా...

గుంటూరు రూరల్ మండలంలో అయితే ఏకంగా ఆ మండల ప్రథమ పౌరురాలే మంత్రి రావెలపై తిరుగుబావుటా ఎగురవేశారు. త్వరలో జరగనున్న టీడీపీ జన చైతన్య యాత్రకు ఎలా వస్తారో చూస్తామంటున్నారు. గుంటూరు రూరల్ ఎంపీపీ తోట లక్ష్మీకుమారి పార్టీలో క్రియాశీలకంగా వ్యహరిస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు.  ఇది మంత్రి వర్గానికి కంటకింపుగా మారి, అవకాశం వచ్చిన ప్రతీసారీ ఆమెపై మంత్రికి  ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లాపరిషత్ సమావేశపు హాలులో నియోజకవర్గ అభివృద్ధిపై జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి రావెలకు, ఆమెకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.

  జిల్లాపరిషత్ సభ్యులు కానివారు సమావేశం నుంచి వెళ్లిపోవాలంటూ  లక్ష్మీకుమారి భర్తను ఉద్దేశించి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు ఒక్క లక్ష్మీకుమారి భర్త వరకు పరిమితం చేసి మిగిలిన మహిళా ప్రజాప్రతినిధుల భర్తలకు వర్తింప చేయకుండా సమావేశాన్ని కొనసాగించారు. దీంతో లక్ష్మీకుమారి మంత్రితో వాగ్వాదానికి దిగటమే కాకుండా త్వరలో జరగనున్న జనచైతన్య యాత్రలకు మండలానికి ఎలా వస్తారో చూస్తానని మంత్రిపై మండిపడ్డారు.
 
 అనుకూల వర్గం ఉన్నా  లేదు ఉపయోగం..
 నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో మంత్రికి అనుకూల వర్గం ఎక్కువగానే ఉన్నప్పటికీ, వారంతా ఆయన వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడని భావిస్తే, అసలు అందుబాటులోనే లేకపోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించాలని, పట్టువిడుపు, సంయమనంతో వ్యవహరించాలని వారంతా మంత్రికి సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement