
విపత్తుల నిర్వహణ మెరుగుపడాలి
* జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
సాక్షి, రాజమండ్రి: రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ వ్యవస్థ మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక హోటల్ ఆనంద్ రీజెన్సీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించి బాధితులకు అండగా నిలవాలని భావించానని, కానీ భద్రతా కారణాలరీత్యా సహాయక కార్యక్రమాలకు అంతరాయం కలగకూడదనే వెనుదిరిగానని చెప్పారు.
తుపానుతో తీవ్రంగా నష్టపోయినా విశాఖ వాసులు అధైర్యపడలేదన్నారు. ప్రభుత్వ యంత్రాంగం తమను నిర్లక్ష్యం చేయడం లేదనే ధీమాతో ఉన్నారని చెప్పారు. ‘సమస్య ఉంది. కానీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. తుపానుతో ధ్వంసమైన విద్యుత్తు వంటి వ్యవస్థల పునరుద్ధరణకు సమయం పడుతుందన్నారు.
అండగా నిలిచేందుకే..
తుపానుతో సర్వం కోల్పోయిన ప్రజలకు ఎంత ఇచ్చినా వారి కష్టాన్ని తీర్చలేమని, కానీ బాధితులకు తాము అండగా ఉన్నామన్నదే స్టార్‌నైట్ నిర్వహణ వె నుక ఉద్దేశమని పవన్‌కల్యాణ్ అన్నారు. జనసేన తరఫున సేవాకార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి కూడా సేవాతత్పరులు ముందుకు వస్తున్నారన్నారు. ఏది కావాలో ప్రజలు నిర్దిష్టంగా చెబితే అది పార్టీ తరఫున చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ తుపాను నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ తక్షణం స్పందించారన్నారు.