పెద్దతిప్పసముద్రం: మండలంలోని సంపతికోటకు చెందిన ఓ మహిళ శుక్రవారం సాయంత్రం ఇద్దరు చిన్న పిల్లలతో కలసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం రాయల్‌పాడ్ మండలం ఎరమారిపల్లి పంచాయతీ తవటంపల్లికి చెందిన రత్నమ్మ (30)కు పీటీఎం మండలంలోని సంపతికోటకు చెందిన తోటి చంద్రశేఖర్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నందకిశోర్, నయనశ్రీ, గంగాధర్ అనే ముగ్గురు సంతానం. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ పొలంలో పత్తి పంటకు క్రాసింగ్ చేసే విషయంలో శుక్రవారం భార్యాభర్తలు గొడవ పడినట్లు సమాచారం.
దీంతో జీవితంపై విరక్తి చెందిన రత్నమ్మ తన కుమార్తె నయనశ్రీ (4), కుమారుడు గంగాధర్ (3)ను వెంట బెట్టుకుని వెళ్లింది. మల్లెల సమీపంలోని గుమ్మోల్ల గంగులప్ప బావిలో బిడ్డలను పడేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామంలో కూడా వీరి ఆచూకీ లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీనివాసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో విచారణ చేపట్టారు. చీకటి కావడంతో శవాలను వెలికి తీయడం కష్టతరమైంది. దీంతో బావి వద్ద పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కాపలా ఉంచి శనివారం శవాలను వెలికితీసేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.