పూట కూలీ చేసుకొని పొట్టపోసుకునే కూర్మాపు చక్రపాణి, భారతి దంపతులది ఎల్.ఎన్.పేట మండలం కొవిలాం గ్రామం.
ఎల్.ఎన్.పేట: పూట కూలీ చేసుకొని పొట్టపోసుకునే కూర్మాపు చక్రపాణి, భారతి దంపతులది ఎల్.ఎన్.పేట మండలం కొవిలాం గ్రామం. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు చంద్రశేఖర్ ఎల్.ఎన్.పేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా, రెండో కొడుకు వెంకటరమణ అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. పేదవారైనప్పటికీ ఉన్నంతలో సంతోషంగా గడుపుతున్న ఆ కుటుంబంపై విధి పగబట్టి, కల్లోలం రేపింది. ఎనిమిది నెలల క్రితం వెంకటరమణ అంతుచిక్కని రుగ్మతకు గురై మంచాన పడ్డాడు.
శరీరంపై పెద్దపెద్ద పుండ్లు మాదిరిగా కాయలు వస్తున్నాయి. ఇక్కడా అక్కడా అని లేకుండా శరీరమంతా పాకుతున్నాయి. మొదట ఒకచోట కనిపించే కాయ.. కొన్ని గంటల వ్యవధిలో మరోచోటికి మారుతోందని బాధితుడు వెంకటరమణ చెప్పారు. వాపు ఉన్న చోట బాగా నొప్పిగా ఉంటుందని వివరించాడు. మొఖం, చంకలు, మొలలు, వీపు, చేతులు తదితర బాగాల్లో ఇవి కనిపిస్తున్నాయన్నాడు.
కూర్చున్నా, పడుకున్నా భరించలేని బాధగా ఉంటుందని చెప్పాడు. ఈ సమస్యను గుర్తించిన మొదట్లో తల్లిదండ్రులు శ్రీకాకుళంలోని ఒక డాక్టర్ వద్దకు తీసుకెళ్లి చూపించారు. పలు పరీక్షలు నిర్వహించి, మందులు ఇచ్చినప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో విశాఖపట్నం తీసుకువెళ్లాలని సూచించారని బాధితుడి తండ్రి చక్రపాణి వివరించారు. ఆయన సూచన మేరకు విశాఖలోని క్వీన్స్ ఎన్నారై క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్య నిపుణుడు బి.రవిశంకర్ పరిశీలించి ఇది రక్త సంబంధిత వ్యాధి అని చెప్పారని, తమ కుమారుడి నుంచికొన్ని నమూనాలను ముంబైకి పంపి, నివేదికలు తెప్పించారని చక్రపాణి చెప్పారు.
వాటిని పరిశీలించి ఇదో అరుదైన వ్యాధి అని, ఇటువంటి వాటికి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స చేసే వైద్యులు ఉన్నారని, అక్కడికి తీసుకువెళ్లాలని సూచించారని చెప్పారు. అక్కడికి తీసుకెళ్లి చూపిస్తే రూ.3 లక్షల ఖర్చవుతుందని చెప్పడంతో అంత స్తోమత లేక వెనుదిరిగి వచ్చామన్నారు. ఏపూటకు ఆ పూట కూలితో పొట్టుపోసుకునే తాము కొడుకును విశాఖపట్నం తీసుకువెళ్లేందుకే అప్పులు చేశామని, ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ తీసుకువెళ్లడం తలకుమించిన భారమని ఆందోళనతో విలపిస్తున్నారు. కళ్లముందే కొడుకు బాధతో విలవిల్లాడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నామని వాపోయారు. దాతలు సహృదయంతో స్పందించి ఆర్థిక సహాయం (సెల్ నెం.94410 24040, బ్యాంకు అకౌంట్ నెం.62328077834, ఎస్‌బిహెచ్, హిరమండలం) చేయాలని కోరుతున్నారు.