
ఐఏఎస్, ఐపీఎస్ పంపిణీపై వారంలో మార్గదర్శకాలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీపై మరో వారంలో మార్గదర్శకాలు సిధ్దం చేయాలని ప్రత్యూష్ సిన్హా కమిటీ నిర్ణయించింది. పారదర్శకత, ఆచరణాత్మకత, నిష్పాక్షికత, సమానత్వం ప్రాతిపదికన మార్గదర్శకాలు రూపొందించి, వాటిని వెబ్‌సైట్‌లో పొందుపరచాలని నిర్ణయించింది. గతంలో రాష్ట్రాల విభజన సందర్భంగా అధికారుల పంపిణీని చేపట్టిన యూసీ అగర్వాల్ కమిటీ నివేదికను కూడా పరిశీలనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. గురువారం ఇక్కడి కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సిన్హా కమిటీ కీలక సమావేశం నిర్వహించింది.
దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి, అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, సంయుక్త కార్యదర్శి సురేష్‌కుమార్, డీఓపీటీ అదనపు కార్యదర్శి అర్చనా వ ర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే అధికారుల నుంచి వచ్చిన సూచనలు, కన్‌ఫర్డ్ ఐఏఎస్‌ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులపై ఈ భేటీలో చర్చించారు. అధికారుల పంపిణీపై వారం రోజుల్లో పూర్తిస్థాయి మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించినట్లు ఈ సమావేశం అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి మీడియాకు తెలిపారు. మార్గదర్శకాలను ముందుగా ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పిస్తామని, వాటిని వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు వేసుకున్నట్లు తెలిపారు.
కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాలు సిద్ధం
రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపిణీకి సంబంధించి కమల్‌నాథన్ కమిటీ హోంశాఖ కార్యదర్శితో గురువారం మధ్యాహ్నం విడిగా భేటీ అయింది. సుమారు మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి ఉద్యోగుల తాత్కాలిక విభజనకు మార్గదర్శకాలతో కూడిన నివేదికను కమల్‌నాథన్ హోంశాఖకు అందజేసినట్లు సమాచారం. చట్టప్రకారం ఉద్యోగులందరికీ ఆప్షన్లు ఇవ్వాలని ఆయన ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే ఉద్యోగుల్లో ఏ స్థాయి వరకు ఆప్షన్లు ఇవ్వాలన్నది కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతే నిర్ణయించాల్సి ఉంటుందని పేర్కొన్నట్లు సమాచారం. కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను త్వరలోనే వెబ్‌సైట్‌లో పెట్టి ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు, సలహాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆప్షన్లకు సంబంధించి తెలంగాణ, ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల నుంచి వస్తున్న డిమాండ్లపైనా హోంశాఖ అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. కమల్‌నాథన్ కమిటీ సిఫార్సులు సిద్ధమయ్యాయని సమావేశం అనంతరం సీఎస్ మహంతి మీడియాకు తెలిపారు. వీటితో పాటే రాష్ట్ర విభజనకు సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తి కావొచ్చాయని, వారంలో అంతా పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.
స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేయాలి: టీజీవో
స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీజీవో) నేతలు కేంద్ర హోంశాఖ అధికారులు, కమలనాథన్ కమిటీని కోరారు. టీజీవో నేత శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో నేతలు వి.ఉమాకాంత్‌రెడ్డి, పి.సత్యనారాయణ, పురుషోత్తంరెడ్డి, మధుసూదన్‌గౌడ్, పి.కృష్ణమోహన్, జి.నర్సింహులు, టి.హరికృష్ణలు కమల్‌నాథన్‌ను, హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి, అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, డీఓపీటీ అదనపు కార్యదర్శి అర్చనావర్మ తదితరులను కలిసి ఈమేరకు వినతిపత్రం సమర్పించారు. సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వకూడదని కోరారు. ఆప్షన్లు ఉంటాయని చట్టం చెబుతోందని, ఒకవేళ ఆప్షన్లు పెట్టకూడదంటే దానికి చట్ట సవరణ అవసరమని హోంశాఖ అధికారులు చెప్పినట్లు తెలిసింది. అధికారుల ముందు ఉద్యోగ సంఘాల నేతలు పెట్టిన డిమాండ్లు ఇవీ..
స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేయాలి. అప్పుడే తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి
ఖాళీల సాకుతో ఆంధ్రా ప్రాంతీయులను డెప్యుటేషన్‌పై నియమించడాన్ని మానుకోవాలి
610 జీవోని అమలు చేయాలి. అందుకు విరుద్ధంగా ఉద్యోగాలు పొందిన వారిని వెనక్కి పంపాలి
ఇరు రాష్ట్రాలకు సచివాలయాలు వేరుగా ఉండాలి
సీమాంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వకూడదు. అవసరమైతే చట్టంలో సవరణలు చేయాలని కమిటీ ప్రతిపాదన చేయాలి.
17 లేదా 18న ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో కీలకమైన ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ మార్గదర్శకాలను ఈ నెల 17 లేదా 18న విడుదల చేయనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపులో అఖిల భారత సర్వీసు అధికారులతో పాటు రాష్ట్ర కేడర్‌కు చెందిన ఉద్యోగులు కూడా పాల్గొంటారు. అంతకుముందుగానే ఉద్యోగులు, అధికారుల పంపిణీ మార్గదర్శకాలను జారీ చేస్తే ఆ ప్రభావం ఓట్ల లెక్కింపుపై పడుతుందని కేంద్ర ఎన్నికల కమిషన్‌తో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ భావిస్తున్నారు. దీంతో ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే మార్గదర్శకాలు జారీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో లెక్కింపు పూర్తయిన మరునాడు లేదా రెండో రోజున మార్గదర్శకాలను జారీ చేయనున్నారు.