రాష్ట్ర విభజన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో జిల్లాలోని కాంగ్రెస్ నేతలు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్ర విభజన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో జిల్లాలోని కాంగ్రెస్ నేతలు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్‌లో ఉంటే తమకిక భవిష్యత్తు ఉండదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ సీఎం వెనుక ఉన్నందుకు ప్రజలు తమపై ఆగ్రహంతో ఉన్నారని భావిస్తున్నారు. సీఎం కిరణ్ నాటకీయంగా రాష్ట్ర విభజనకు సహకరించారని అంతా విశ్వసిస్తుండటంతో ఇప్పటి వరకు ఆయన వెంట నడిచిన జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రజల ముందుకు వచ్చేందుకు జంకుతున్నారు.
జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇది జిల్లా కాంగ్రెస్ నేతలను మరింత కుంగదీసింది. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఉన్నప్పటికీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించడంతో ఆమెపై జిల్లావాసుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
లోక్‌సభలో విభజన బిల్లు ఆమోదించడంతో మంగళవారం యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబులు తమ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటు వెంకటేశ్వరరావు చాలాకాలం క్రితమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటువేసి పార్టీ పట్ల ఉన్న విముఖతను తెలియజేశారు. ఇకపై ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశం ఉండకపోవచ్చని స్పష్టమవుతోంది. ఆయన టీడీపీ లేదా బీజేపీల వైపు చూస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా దర్శి తాజా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, అద్దంకి తాజా మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. ప్రస్తుతం వారు ఆయా నియోజకవర్గాలకు పార్టీ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు.
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా నేడో, రేపో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. కందుకూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రి మహీధర్ రెడ్డి కాంగ్రెసును వీడి, కిరణ్ కొత్త పార్టీ పెడితే దానివైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రాజీనామా చేసే సమయంలో ఆయన వెనకే ఉండటం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.
ఇక సంతనూతలపాడు, కొండపి, కనిగిరి ఎమ్మెల్యేలు బీఎన్ విజయకుమార్, జీవీ.శేషు, ముక్కు ఉగ్రనరసింహారెడ్డిలు వారి వైఖరిని స్పష్టంచేయాల్సి ఉంది. వీరు కూడా కాంగ్రెసు పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సీఎం కొత్త పార్టీపైనా సందేహాలు..
కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన నాయకత్వం జిల్లాలో లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు అయోమయంలో పడ్డారు. దీంతో వారంతా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అనే గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడితే, ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా అనే ప్రశ్న కూడా వీరిలో తలెత్తుతోంది. కిరణ్‌కు చరిష్మా ఏముందని, ఆయన పట్ల ప్రజలు ఏమేరకు ఆకర్షితులవుతారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో కూడా మంచి పేరు లేని ఆయన వెంట ఎంతమంది నాయకులు వస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకోవడంలో కాంగ్రెస్ నేతలు తలమునకలై ఉన్నారు.