సాక్షి, నిజామాబాద్: గడిచిన నాలుగున్నరేళ్లలో అసెంబ్లీ సమావేశాలను పరిశీలిస్తే జిల్లా ఎమ్మెల్యేల హాజరు అంతంత మాత్రమే ఉంది. తమ నియోజకవర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, అభివృద్ధి పనులను శాసనసభలో ప్రస్తావించాల్సిన ప్రజాప్రతినిధులు అస లు సమావేశాలకే ముఖం చాటేశారు. జీతా లు, భత్యాల రూపంలో నెలనెలా లక్షల రూపాయల అలవెన్సులు పొందుతున్న వీరికి ప్రజ ల బాధలు మాత్రం పట్టడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలను మినహాయిస్తే అసెంబ్లీ 12 సార్లు సమావేశమైంది. మొత్తం 173 రోజులు సమావేశాలు జరిగాయి. 2009 మే నెలలో ఎన్నికైన ఎమ్మెల్యేల పదవీకాలం మరో నాలుగు నెలల్లో ముగి యనుంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎమ్మెల్యే ల అసెంబ్లీ సమావేశాల హాజరు తీరును పరిశీ లిస్తే...
మండవ వెంకటేశ్వర్‌రావు
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తు న్న టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటే శ్వరరావు 75 రోజుల పాటు శాసనసభ సమావేశాలకు హాజరు కాలేదు. ఈ ఏడాది జూన్‌లో పదిరోజుల పాటు జరిగిన 12వ సెషన్స్ రెండో విడతలో ఒక్కరోజు కూడా హాజరు కాలేదు. 2012 నవంబర్‌లో మూడు రోజులు జరిగిన 11వ సెషన్స్‌కు కూడా దూరంగా ఉన్నారు. ఏడో సెషన్స్ 30 రోజుల పాటు జరిగితే 24 రోజులు సభలో కనిపించలేదు. డుమ్మాకొట్టిన జిల్లా ఎమ్మెల్యేల్లో మండవది మొదటి స్థానం.
ఈరవత్రి అనిల్
పీఆర్‌పీ అభ్యర్థిగా గెలుపొంది కాంగ్రెస్‌లో చేరిన బాల్కొండ ఎమ్మె ల్యే ఈరవత్రి అనిల్ ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యే వరకు 54 రోజులు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. నాలుగో, ఏడో సెషన్స్‌లో చాలా రోజులు అనిల్ హాజరు కాలేదు.
ఏలేటి అన్నపూర్ణమ్మ
ఆర్మూర్ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ 40 రోజులు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారు. 2011 ఫిబ్రవరి, మార్చిలో 31 రోజుల పాటు ఏడో సెషన్స్ జరిగితే 23 రోజులు హాజరుకాలేదు. 2012 ఫిబ్రవరి, మార్చిలో 29 రోజులకు 9 రోజులు గైర్హాజరయ్యారు.
హన్మంత్ సింధే
జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే కూడా అసెంబ్లీ సమావేశాలకు 38 రోజులు హాజరు కాలేదు. 2010 ఫిబ్రవరి, మార్చిలో జరిగిన సమావేశాలకు నాలుగు రోజులు, 2011 ఫిబ్రవరి, మార్చిలో జరి గిన సమావేశాలకు ఏకంగా 22 రోజులు, 2012లో జరిగిన సమావేశాలకు 10 రోజులు గైర్హాజరయ్యారు.
పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలుపొందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఏకంగా 45 రోజులు సమావేశాలలో పాల్గొనలేదు. పోచారం ఏడో సెషన్స్‌లో 25 రోజులు, తొమ్మిది సెషన్స్‌లో 14 రోజులు సభలో లేరు. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైన జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల్లో పోచారం మూడో స్థానంలో ఉన్నారు.
ఏనుగు రవీందర్‌రెడ్డి
ఎల్లారెడ్డి నుంచి గెలుపొందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి 42 రోజులు సభకు రాలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎమ్మె ల్యే పద వికి రాజీనామా చేయడంతో 2010లో ఫిబ్రవరి, మార్చి మాసాల్లో జరిగిన 4వ సెషన్స్‌కు ఆయన హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది. తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత 2011లో సమావేశాలకు 23 రోజులు దూరంగా ఉన్నారు. గత ఏడాది తొమ్మిదో సెషన్స్‌లో 14 రోజులు సభకు వెళ్లలేదు.
గంప గోవర్ధన్
మొదట టీడీపీ అభ్యర్థిగా కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన గంప గోవర్ధన్ హాజరు అసెంబ్లీ సమావేశాలకు కాస్త మెరుగ్గానే ఉంది. 23 రోజులు మాత్రమే సభలో పాల్గొనలేకపోయారు. 2011లో ఆయన టీడీపీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో డిసెంబర్‌లో జరిగిన 8వ సెషన్స్‌కు హాజరయ్యే అవకాశం దొరకలేదు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన ఒకటీ రెండు రోజులు మినహా ప్రతిసారి సభకు హాజరవుతూనే ఉన్నారు.
యెండల లక్ష్మీనారాయణ
బీజేపీకి చెందిన నిజామాబాద్ అర్మన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ 34 రోజులు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. తెలంగాణ రాష్ర్టం కోసం యెండల 2010లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి విజయం సాధించారు. ఈ మధ్య కాలం లో 37 రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరయ్యే అవకాశం దక్కలేదు.
శాసనసభలో మన ఎమ్మెల్యేల హాజరు అంతంతే!
Published Fri, Dec 20 2013 6:43 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement
Advertisement