డోంట్ కేర్ | District of unauthorized units in the random canister | Sakshi
Sakshi News home page

డోంట్ కేర్

Published Sun, Nov 1 2015 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 11:50 AM

డోంట్ కేర్

డోంట్ కేర్

జిల్లాలో యథేచ్ఛగా బాణ సంచా అనధికార తయారీ కేంద్రాలు
నిర్లక్ష్యానికి ఏటా నిండు ప్రాణాలు బలి
కనీస నిబంధనలు పాటించని  నిర్వాహకులు
మామూళ్ల మత్తులో అధికారులు

 
విశాఖపట్నం: దీపావళి సమీపిస్తోంది.. వెలుగుల తారాజువ్వల మధ్య పండుగ జరుపుకోవాలని అందరూ అనుకుంటారు. అయితే మందుగుండు సామగ్రి కాల్చడంలో జాగ్రత్తలు పాటించకపోయినా, తయారీలో నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలకే ముప్పు వాటిళ్లుతుంది. జిల్లాలో అక్రమ మందుగుండు సామాగ్రి తయారీ, నిల్వల వల్ల ఇప్పటికే అనేక ప్రమాదాలు సంభవించాయి.   వీటిపై పోలీసులు, అధికారులు సరైన దృష్టిసారించడం లేదు. గతేడాది హుద్‌హుద్ తుపాను కారణంగా ప్రభుత్వమే దీపావళి వేడుకల్లో బాణ సంచా నిషేధించింది. గతేడాది పండుగకు దూరమైన జిల్లా వాసులు ఈ ఏడాది ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బాణ సంచా తయారీ జోరందుకుంది. జిల్లాలో రాంబిల్లి, గోకులపాడు, పాయకరావుపేట, అనకాపల్లిలో పిసిరికాడ, గవరపాలెం, కొప్పాక, సబ్బవరం మండలం మొగలపురం, గుళ్లేపల్లి, సబ్బవరం, పరవాడ, పందుర్తి మండలం పినగాడి, యలమంచిలిలో ఎక్కువగా బాణ సంచా తయారీ కేంద్రాలున్నాయి. అనుమతులు పొందిన బాణ సంచా కేంద్రాలు జిల్లాలో వందలోపే ఉంటే ఏ విధమైన అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న అనధికారిక తయారీ కేంద్రాలు కోకొల్లలున్నాయి. ఎక్కడో అరకొర దాడులు చేసి  అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. నగరంలోని పలు ప్రాంతాలకు తరలించి గొడౌన్లలో నిల్వు ఉంచుతున్నారు. రెండు రోజులు క్రితం నగరంలోని పూర్ణామార్కెట్ ప్రాంతంలోని కల్లుపాకల్లో, రూరల్‌లోని నర్సీపట్నం కోమటవీధిలో  అక్రమ మందుగుండు నిల్వలను పట్టుకున్నారు.
 
నిర్లక్ష్యానికి సాక్ష్యాలు ఇవీ..
బాణ సంచా తయారీకి వినియోగించే సామగ్రి అంతా త్వరగా మండే స్వభావం ఉన్నవే. గంథకం, సూర్యకారం,  అమ్మోనియం సల్ఫేట్, భాస్వరం ఏదైనా మంటను ప్రేరేపించేవే. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సర్వం భస్మీపటలం చేస్తాయి.  ఎస్.రాయ వరం మండలం గోకులపాడులో ఈ ఏడాది మార్చి 29న మందు గుండు సామాగ్రి కేంద్రంలో ప్రమాదం జరిగి ఐదుగురు ప్రాణాలు వదిలారు. 10 మంది గాయాలపాలయ్యారు.  రాంబిల్లి మండలం  నారాయణపురంలో ఈ ఏడాది జనవరి 26న జరిగిన పేలుడులో నలుగురు చనిపోయారు.  ఏడాదిన్నర క్రితం సబ్బవరం మండలం గుళ్లేపల్లి గ్రామంలో పేలుడులో ఇద్దరు చనిపోయారు.

సబ్బవరం మండలంలో ముగలిపురంలో రెండేన్నరేళ్ల ఏళ్ల క్రితం ఒకరు చనిపోయారు.  చోడవరం మండలం అంకుపాలెం వద్ద రెండున్నర ఏళ్ల క్రితం జరిగిన పేలుడులో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.  భీమిలి శివారులో బాణ సంచా తయారీ కేంద్రంలో మూడున్నరేళ్ల క్రితం పేలుడు సంభవించింది. రాత్రివేళ ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం సంభవించలేదు.  ఏడాది క్రితం యలమంచిలిలో అనధికారిక బాణ సంచా తయారీ కేంద్రం నిర్వాహకులు వ్యర్థాలను బయటపడేయడంతో అవి పేలి స్థానికుడు గాయపడ్డారు.
 
ఇవీ నిబంధనలు..  
బాణ సంచా తయారీ కేంద్రాల్లో అగ్ని ప్రమాదాలు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు నిబంధనలు అమల్లో ఉన్నాయి.  బాణ సంచా తయారీ కేంద్రాలు జనావాసాలు, పరిశ్రమలకు దూరంగా ఉండాలి.    వెలుతురు, గాలి బాగా ప్రసరించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.  తయారీ కేంద్రాల వద్ద తప్పనిసరిగా వాటర్ స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయాలి.  వాటర్ ట్యాంకు ఏర్పాటుచేయాలి. ప్రమాదాలు సంభవించినప్పుడు అరికట్టేందుకు వీలుగా బూస్టర్ పంపులు ఏర్పాటుచేయాలి.  సాండ్ బకెట్లు (ఇసుకతో నింపినవి), వాటర్ బకెట్లు ఏర్పాటు చేయాలి.  డ్రై కెమికల్ ఫౌడర్ ఫైర్ ఎక్సిటింగ్ విషర్స్ నాలుగు, 4.5 కేజీ సామర్థ్యం కలిగిన కార్బన్‌డయాక్సైడ్ ఫైర్ ఎక్సిటింగ్ విషర్ ఒకటి అందుబాటులో ఉంచాలి.  అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదం జరిగినపుడు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై   సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి.  సిబ్బందికి ప్రమాదబీమా చేయించాలి.
 
ప్రమాదం సంభవించినపుడు ఫైర్ స్టేషన్‌కు సమాచారమిచ్చేందుకు వీలుగా స్టేషన్‌తో పాటు సిబ్బంది నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలి.  ఎప్పటికప్పుడు ఫైర్ అధికారులు ఆయా కేంద్రాలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలి. సిబ్బంది అజాగ్రత్తగా పనిచేయరాదు, కేంద్రాల పరిసరాల్లో ధూమపానం చేయరాదు.18 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన పిల్లలను బాణ సంచా తయారీ కేంద్రాల్లో తయారీకి వినియోగించకూడదు.
 
దుకాణాల వద్ద జాగ్రత్తలు.
.
మంజూరు చేసిన పరిమితికి మించి బాణ సంచా నిల్వ చేయకూడదు. షాపునకు షాపునకు మధ్య మూడు మీటర్ల దూరం ఉండాలి. 18 సంవత్సరాల లోపు వయస్సు వారిని బాణ సంచా దుకాణం వద్ద ఉంచరాదు.  షాపు వద్ద పొగతాగరాదని సూచిస్తూ బోర్డు  ఏర్పాటుచేయాలి.  షాపు వద్ద నీటితో నింపిన నాలుగు, ఇసుకతో నింపిన నాలుగు బకెట్లు ఉండాలి. 200 లీటర్ల నీటితో డ్రమ్మును ఏర్పాటు చేసుకోవాలి.  షాపు వద్ద తొమ్మిది లీటర్ల సామర్థ్యం కలిగిన వాటరుపైపు స్కిటు ఫైర్ ఎక్సెటింగ్ విషర్ ఏర్పాటు చేసుకోవాలి.  ఐదు లీటర్లు సామర్థ్యం కలిగిన డ్రై కెమికల్ ఫౌడర్ ఫైర్ ఎక్కిటింగు విషర్ ఏర్పాటు చేయాలి.  తారాజువ్వలు, రాకెట్లు, పేలుడు సామగ్రి అమ్మకూడదు.  షాపు వద్ద జరిగే ప్రమాదానికి, ప్రాణ, ఆస్తినష్టానికి లెసైన్సుదారుడే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement