జిల్లాలో పలుచోట్ల స్వల్ప భూకంపం | District places a small earthquake | Sakshi
Sakshi News home page

జిల్లాలో పలుచోట్ల స్వల్ప భూకంపం

Published Thu, Aug 8 2013 3:15 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM

జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం 3.25 సమయంలో కొద్ది సెకన్ల పాటు స్వల్ప భూకంపం సంభవించింది.

 వలేటివారిపాలెం/లింగసముద్రం/గుడ్లూరు/కందుకూరు/పామూరు,న్యూస్‌లైన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం 3.25 సమయంలో కొద్ది సెకన్ల పాటు స్వల్ప భూకంపం సంభవించింది. వలేటివారిపాలెం మండలంలోని వలేటివారిపాలెం, చుండి, అయ్యవారిపల్లి, పోలినేనిచెరువు, మాలకొండ తదితర గ్రామాల్లో, గుడ్లూరు మండలంలోని పెదలాటరఫి, చినలాటరఫి, మొగళ్లూరు, గుడ్లూరు బీసీ కాలనీ, తెట్టు గ్రామాల్లో,  లింగసముద్రం మండలంలోని లింగసముద్రం, పెదపవని, మొగిలిచర్ల, పెంట్రాల గ్రామాల్లో, కందుకూరు పట్టణంలో మధ్యాహ్నం 3.15 సమయంలో, పామూరు మండలంలో మధ్యాహ్నం 3.40 నుంచి 3.45 మధ్య స్వల్పంగా  భూమి కంపించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. బ్యారన్లపై ఉండే రేకులు, ఇళ్లలోని సామగ్రి కదిలాయి.
 
 ఇళ్ల గోడలు కంపించడంతో అరుగులపై కూర్చున్న వారు పరుగులు తీశారు. వలేటివారిపాలెం బస్టాండ్ సెంటర్లో భూమి కంపించడంతో దుకాణాల్లో ఉన్న వారు భయంతో రోడ్లపైకి పరుగుపెట్టారు. ఇళ్లలో ఉన్న చిన్నచిన్న వస్తువులు కింద పడటంతో భయపడిన ప్రజలకు ఇళ్లబయటకొచ్చారు. ఇంట్లో టీవీ చూస్తుండగా భూమి కదిలినట్లయిందని, ఆ తాకిడికి ర్యాకుల్లో ఉన్న తేలిక వస్తువులు కింద పడటంతో భయంతో పరుగులు తీశానని పెదలాటరఫి గ్రామానికి చెందిన మాలకొండారెడ్డి తెలిపారు. మొగిలిచర్లలో మూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో జిల్లా పరిషత్ పాఠశాలలోని రెండు మూడు గదుల్లో శ్లాబు, కిటికీల గోడలు, బ్లాక్ బోర్డులు పగుళ్లిచ్చాయి. పెదపవనిలో ఇళ్లపై సిమెంటు రేకులు నెర్రెలిచ్చాయి.
 
 పామూరు మండల పరిధిలోని పాబోలువారిపల్లె గ్రామానికి చెందిన ఉప్పుటూరి మాలకొండయ్య ఇంటి గోడలు స్వల్పంగా పగుళ్లిచ్చాయి. ప్రహరీ కూడా కొద్దిగా దెబ్బతింది. భూమి కంపించిన సమయంలో బీరువా లోపల, పైన ఉంచిన వస్తువులు కదిలినట్లు శబ్దాలొచ్చాయని, భూకంపం వచ్చినట్లు గ్రహించి వెంటనే బయటకు పరుగులు తీసినట్లు మాలకొండయ్య తెలిపారు. కందుకూరు పట్టణంలోని పాత బ్యాంకు బజారు, ఎస్‌బీఐ పరిసర ప్రాంతాల్లో కొన్ని క్షణాల పాటు భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్న జనం బయటకు పరుగులు తీశారు. అదేవిధంగా పామూరు మండలం బోడవాడ, అయ్యవారిపల్లె, రేణిమడుగు గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లు ఆ గ్రామాలకు చెందిన గోవిందు కొండారెడ్డి, ఎమ్ రామకృష్ణ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement