జిల్లా వ్యాప్తంగా ఆరువేల సౌర విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసిందని ఏపీ ట్రాన్స్‌కో డివిజినల్ ఇంజినీర్ జి.ప్రసాద్ తెలిపారు.
గజపతినగరం రూరల్: జిల్లా వ్యాప్తంగా ఆరువేల సౌర విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసిందని ఏపీ ట్రాన్స్‌కో డివిజినల్ ఇంజినీర్ జి.ప్రసాద్ తెలిపారు. విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని విద్యుత్ కాల్‌సెంటర్‌ను ఆయన బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే గజపతినగరం, దత్తిరాజేరు, గంట్యాడ, బొండపల్లి మండలాలకు చెందిన 96మంది సౌర విద్యుత్ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 80మందికి కనెక్షన్లు ఇచ్చామన్నారు.
3హెచ్‌పీ, 5హెచ్‌పీ మోటార్లకు రాయితీ ఉంటుందని తెలిపారు. రూ.3.36 లక్షల విలువైన 3హెచ్‌పి మోటార్‌కు రైతు కేవలం రూ.40 వేలు కడితే చాలని, మిగతా మొత్తం రాయితీ అని, 5హెచ్‌పి మోటార్ ఖరీదు రూ.4.29 లక్షలుండగా రూ.55 వేలు కట్టి రాయితీ పొందవచ్చని తెలిపారు. సౌర విద్యుత్ ప్యానల్స్‌ను వాడిన వినియోగదారులకు 30 ఏళ్ల హామీ ఇస్తున్నట్టు తెలిపారు. ఆయన వెంట ట్రాన్స్‌కో ఏడీఈ కె.శ్రీనివాసరావు, ఏఈ డి.పిచ్చయ్య ఉన్నారు.