రాష్ట్రంలో మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం 2013-14 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ. 118 కోట్లు మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సంస్థ అధ్యక్షుడు ఎండీ హిదాయత్ తెలిపారు.
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్: రాష్ట్రంలో మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం 2013-14 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ. 118 కోట్లు మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సంస్థ అధ్యక్షుడు ఎండీ హిదాయత్ తెలిపారు. శనివారం గుంటూరు విచ్చేసిన ఆయన స్థానిక నగరంపాలెంలోని మైనారిటీ ఆర్థిక సంస్థ కార్యనిర్వాహక సంచాలకుల కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మైనారిటీ వర్గాల అభివృద్ధికి మంజూరు చేస్తున్న పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని జిల్లాల వారీగా సమీక్షిస్తున్నట్టు తెలిపారు.
మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కనీసం 50 శాతం కూడా లక్ష్యాలను సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాకు 2013-14 సంవత్సరానికి 1,844మంది లబ్ధిదారులకు వివిధ పథకాల కింద బ్యాంకుల నుంచి రుణం మంజూరుకు రూ.6.92కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఎన్నికల నియమావళి కారణంగా పథకాల అమలులో జాప్యం జరిగినా 90 శాతం లక్ష్య సాధనకు కృషి చేసిన జిల్లా అధికారులను, శిక్షణ విభాగపు అధికారులను ఆయన అభినందించారు.
2014-15 ఆర్థిక సంవత్సరానికి జూన్ 2 నుంచి 4 నెలలు మైనారిటీ సంక్షేమ పథకాల అమలు కోసం వెయ్యికోట్ల రూపాయలు గవర్నర్ కేటాయించారని చెప్పారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక పథకాల అమలుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. సమావేశంలో జిల్లామైనారిటీ ఆర్థిక సంస్థ ఇడి నారాయణ, శిక్షణ విభాగపు అధికారులు పాల్గొన్నారు.