విభజన అప్రజాస్వామికం: శైలజానాథ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ అప్రజాస్వామికంగా జరుగుతోందని శాసనసభా వ్యవహారాల మంత్రి శైలజానాథ్ అన్నారు. ఎవరో తరుముకొస్తున్నట్టుగా కేంద్రం రాష్ట్ర విభజన బిల్లును పంపిందన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే విధంగా, మెజార్టీ ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. గురువారం శాసన మండలిలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు -2013పై ప్రభుత్వ పక్షాన ఆయన చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడి ప్రజలపై వివక్ష చూపే విధంగా బిల్లును తెచ్చారని, తెలుగు జాతి వైభవం, ఐక్యత, అభివృద్ధి కోసం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నానని పేర్కొన్నారు.
‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ రాజ్యాంగ వ్యతిరేక చర్య. అధికారం ఉంది కదా.. ఎవరూ ఏమీ చేయలేరు కదా.. అనే రీతిలో కేంద్రం వ్యవహరించడం మంచిది కాదు’’ అని అన్నారు. శైలజానాథ్ చర్చను ప్రారంభించి మాట్లాడడంపై తెలంగాణ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శైలజానాథ్ మండలి సభ్యుడు కాదని, మండలి నాయకుడు సభలో ఉండగా ఆయనతో ఎలా మాట్లాడిస్తారని ప్రశ్నించారు. మంత్రిగా ప్రభుత్వం పక్షాన మాట్లాడితే ప్రభుత్వ విధానానికి కట్టుబడి... విషయానికి మాత్రమే పరిమితమై మాట్లాడాలని, తన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పేందుకు వీల్లేదని అడ్డుపడ్డారు. దీంతో ఆయన మధ్యలోనే ప్రసంగాన్ని ఆపేశారు.
ఎవరికి విధేయులు?: రామచంద్రయ్య
శైలజానాథ్ తర్వాత సభానాయకుడు సి.రామచంద్రయ్య (సీఆర్) మాట్లాడుతూ... కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు తమను ఎన్నుకున్న ప్రజలకు విధేయులుగా ఉండాలా? పార్టీలకా? అన్న ప్రశ్న తలెత్తిందన్నారు. అసలు ఎవరి కోసం ఈ రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. సెంటిమెంట్ ఆధారంగా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలంటే ఈ దేశాన్ని వెయ్యి ముక్కలు చేయాల్సి వస్తుందని, ఈ బిల్లును తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. పదేపదే తెలంగాణ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ‘‘నేను ఏం మాట్లాడాలో మీరు రాసిస్తే చదువుతా. మీ పదాలు నా నోట్లో పెడతారా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.