
పుట్టినూరును మర్చిపోవద్దు...
పాలకొండ రూరల్:సమాజంలో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా కన్నతల్లిని, పుట్టినూరును మర్చిపోరాదని సినీ హాస్య నటుడు అల్లెన వెంకటరమణ అన్నారు. తన స్వగ్రామమైన పాలకొండకు బుధవారం వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. చాలా మంది ఉన్నత పదవులు, స్థాయిలో ఉండి కూడా పుట్టిపెరిగిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిసారించకపోవడం విచారకరమన్నారు. దేశవిదేశాల్లో స్థిరపడిన వ్యక్తులందరూ తమ లాభాల్లో కొంత మొత్తాన్ని పాలకొండ అభివృద్ధికి కేటాయించాలని కోరారు. పాలకొండలో పుట్టి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందంటూ తమ జీవన ప్రస్థానాన్ని వెల్లడించారు.
1976లో చదువులు నిమిత్తం హైదరాబాద్‌లో స్థిరపడిన తనకు నటనపై ఉన్న మక్కువతో సినీ పరిశ్రమకు వెళ్లానని, తొలినాళ్లలో టీవీ, రేడీయో రంగాల్లో అవకాశాలు రాగా 1981లో ప్రభుత్వ ఉద్యోగాన్ని దక్కించుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ చిక్కడపల్లి వెంకటేశ్వర దేవాలయంలో ఈవోగా విధులు నిర్వహిస్తున్నానన్నారు. తను నాల్గవ తరగతి చదువుతున్నప్పుడు పాలకొండ కోమటిపేట స్కూల్‌లో చాచానెహ్రూ వేషం వేశానని, అప్పటినుంచి కళలపై మక్కువ పెంచుకున్నట్టు చెప్పారు. పాలకొండలోనే ఆర్‌సీఎం, ప్రభుత్వోన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివి పలు నాటకాల్లో తన ప్రతిభ చాటినట్టు వివరించారు.
సినీరంగంలో తన తొలిసినిమాలు ప్రతిఘటన, అల్లరిప్రియుడు కాగా తాజాగా విడుదలైన గలాటాతో పాటు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మించిన ప్రతి సినిమాలోను నటించానన్నారు. అప్పటి హాస్యనటులు రేలంగి, చెదలవాడ తనకు స్ఫూర్తిదాయకులుగా పేర్కొన్నారు. ప్రజల్లో సామాజిక సృహపట్ల చైతన్యం కలిగించాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు. ఉద్యోగ బాధ్యతల కారణంగా ప్రస్తుతానికి సినీరంగానికి దూరంగా ఉన్నా త్వరలోనే విశ్రాంతి తీసుకుని పాలకొండ వచ్చి ఇక్కడ నుంచి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి అందిస్తానన్నారు. ఇందులో భాగంగానే ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన వారిని ఒకతాటిపైకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నట్టు చెప్పారు.