మీడియాతో మాట్లాడుతున్న సీఐడీ ఎస్పీ రత్నకుమారి
సాక్షి, చిత్తూరు: పెనుమూరు ప్రభుత్వ వైద్యురాలు అనితా రాణి విచారణకు సహకరించడం లేదని సీఐడీ ఎస్పీ రత్నకుమారి తెలిపారు. ఆమె బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ అనితా రాణిని విచారణ చేసేందుకు రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ రవికుమార్ నేతృత్వంలో విచారణ జరుగుతోందని రత్నకుమారి తెలిపారు. (అనితారాణి ఆరోపణలు: విచారణకు సీఎం జగన్ ఆదేశం)
‘నిన్న చిత్తూరుకు చేరుకున్నాం. సీఆర్పీ 160 సెక్షన్ కింద నోటీసులు పంపాం. విచారణ నిమిత్తం చిత్తూరులోని ఆమె ఇంటికి వెళితే తలుపులు తెరవలేదు. ఫోను ద్వారా సంప్రదించాం. తనకు రాష్ట్ర పోలీసులు, సీఐడీ మీద నమ్మకం లేదని చెబుతున్నారు. ఇవాళ ఉదయం 5.30 గంటలకు అనితా రాణి ఇంటికి వెళ్లాం. కాలింగ్ బెల్ నొక్కినా ఆమె నుంచి సమాధానం రాలేదు. మరోసారి ఫోన్ చేశాం. తనకు సీఐడీ మీద నమ్మకం లేదని చెప్పారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామిని బర్తరఫ్ చేసిన తర్వాత విచారణకు రావాలని చెబుతున్నారు. (విచారణకు సహకరించని డాక్టర్ అనితా రాణి)
తనకు కాలు విరిగిందని చెప్పారు. అనితా రాణి నివాసం ఉంటున్న సమీపంలోని చుట్టుపక‍్కల ఇళ్లవారిని విచారించి వివరాలు నమోదు చేసాం. అనిత రాణి ఇంటికి రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు వస్తున్నారని చెప్పారు. దీంతో ఇవాళ పెనుమురు వచ్చి ఆసుపత్రితో పాటు పోలీస్ స్టేషన్‌లోనూ విచారణ చేశాం. ఒక వైద్యురాలిగా ఉంటూ సీఐడీ మీద నమ్మకం లేదని చెప్పడం భావ్యం కాదు. అన్ని కోణాల్లో మా విచారణ కొనసాగుతుంది’ అని ఎస్పీ రత్నకుమారి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment