పీఠముడి
- వారాలు గడుస్తున్నాఎదురు తెన్నులు
- పదవీ ప్రమాణం చేయని జెడ్పీ, ఎంపీటీసీ సభ్యులు
- కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాకే అధికారపగ్గాలు
- దీర్ఘకాలంగా ప్రత్యేక పాలనలో మండల, జిల్లా పరిషత్‌లు
జిల్లా,మండలపరిషత్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు వింత పరిస్థితి ఎదురైంది. వారాలు గడుస్తున్నా ‘పీఠ’ముడి వీడడం లేదు. గెలిచిన అభ్యర్థులు పాలన పగ్గాలు చేపట్టే పరిస్థితి లేదు. ఎన్నికలు ముగిసి 50 రోజులైనా జిల్లాలో ఇంకా ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. కొత్తపాలక వర్గాలు కొలువు తీరకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన దాదాపు రూ.13 కోట్లు వరకు నిధులు నిలిచిపోయాయి. దీంతో జిల్లాలో అనేక సమస్యలు తిష్టవేశాయి.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికల్లో విజయం సాధించినా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు అధికార దర్పం వెలగబెట్టలేని దుస్థితి. పాలనా పగ్గాలు చేపట్టే విషయంలో వారాల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. సుధీర్ఘకాలం తరువాత ప్రాదేశిక ఎన్నికలు జరిగాయి. జిల్లా పరిషత్ పాలక వర్గ పదవీకాలం 2011 జూన్‌తో ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించలేదు.
దీంతో జిల్లాలో ఇప్పటి వరకు స్పెషల్ ఆఫీసర్ పాలనే కొనసాగింది. కొన్ని విధానపరమైన నిర్ణయాలు, జీతాలు, చెల్లింపులు, అత్యవసర పనులు, సాధారణ పరిపాలన మినహా ప్రజాహిత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వ్యక్తిగత ఇబ్బందుల పరిష్కారం వంటివి అమలుకు నోచుకోలేదు. మండలాల్లో అధికారులు, సిబ్బంది కొరత విపరీతంగా ఉండడంతో ప్రధాన సమస్యలపై కూడా వారు దృష్టి సారించలేని పరిస్థితి ఏర్పడింది.
పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు ఆగిపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా అడ్డంకులు ఏర్పడ్డాయి. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పించేందుకు కూడా నిధుల కొరతతో అధికారులు ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు. దీంతో అనేక సమస్యలు పరిష్కారానికి కొత్త పాలకవర్గం కోసం ఎదురుచూస్తున్నాయి.
అన్నింటికీ నిరీక్షణే : రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో గత నెలలో రెండు దశలలో 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫలితాల కోసం అభ్యర్థులు నెలన్నరపాటు ఉత్కంఠగా ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ నెల 13న జెడ్పీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులెవరో తేలిపోయింది. అయితే ఫలితాలు వచ్చి మూడు వారాలైనా ఇప్పటి వరకు వీరు అధికారికంగా ఆ హోదాలను అనుభవించలేని వింత పరిస్థితిలో ఉన్నారు.
రాష్ర్ట విభజన కారణంగా ఈ దఫా ప్రమాణ స్వీకరాలకు జాప్యం జరుగుతోంది. జూన్ 8న కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక, ఎమ్మెల్యే, ఎంపీలు ప్రమాణ స్వీకారం ముగిశాక వీరి ప్రమాణ స్వీకారాలు ఉండనున్నాయి. అయితే ఆ రోజు ఎప్పుడన్నది ఎవరికీ తెలియదు. రాష్ట్ర విభజన కారణంగా ఎన్నికల్లో గెలిచినా.. ఈ దఫా అధికారాన్ని చేపట్టడానికి వారాలు వేచి ఉండాల్సి వస్తోందని అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు.
కొత్త పాలకవర్గాలపై ఆశలు
కొత్త పాలకవర్గం ఎప్పుడు ఏర్పాటవుతుందోనని ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. జిల్లా పరిషత్‌కు 13వ ఆర్థిక సంఘం నిధుల కింద కేంద్రం నుంచి రూ.కోట్లు రానున్నాయి. ఈ డబ్బులతో గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి పథకాలకు, రోడ్డులు, పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టేందుకు వీలు కలుగుతుంది. అలాగే స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్‌ఎఫ్‌సీ) కింద రూ.1.5 కోట్లు వరకు వస్తుంది. ఇందులో 50 శాతం నిధులతో జిల్లా పరిషత్ పాఠశాలల్లో పారిశుద్ధ్యం, తాగునీటి ఏర్పాట్లను వినియోగించే అవకాశముంటుంది. వీటితో పాటు జనరల్ ఫండ్ కింద ప్రభుత్వం నుంచి రూ.5 నుంచి రూ.6 కోట్లు వరకు విడుదలవుతుంది. ఈ నిధులు వస్తే జిల్లాలో రోడ్లు కల్పనతో పాటు పారిశుద్ధ్యం మెరుగుపడి, మంచినీటి ఇబ్బందులు తొలగుతాయని ప్రజలు భావిస్తున్నారు.