బీజేపీలో సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మధ్య గల ఆధిపత్య పోరుతో పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధంలో ఇమడలేక పార్టీకి రాజీనామా
రాజమహేంద్రవరం సిటీ : బీజేపీలో సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మధ్య గల ఆధిపత్య పోరుతో పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధంలో ఇమడలేక పార్టీకి రాజీనామా చేస్తున్నామని మజ్దూర్ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వాసంశెట్టి గంగాధరరావు, షబ్బితి ఫణీశ్వరరావు ప్రకటించారు. బుధవారం రాజమహేంద్రవరంఆనం రోటరీ హాల్‌లో విలేకరులతో మాట్లాడుతూ నాయకులు వ్యక్తిగత స్వార్థంతో పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. తాము పార్టీలో పనిచేసిన రెండున్నర ఏళ్లలో మానసిక వేదన అనుభవించామని, ఆత్మాభిమానం చంపుకోలేక పార్టీని వీడాల్సి వస్తోందన్నారు.
నగరంలో ఆటోస్టాండ్ బోర్డు విషయంలో నెలకొన్న వివాదంలో నాయకత్వం స్పందించలేకపోయిందన్నారు. రాష్ట్ర కార్యదర్శులుగా ఉన్న తమకు ఏమాత్రం తెలియకుండానే జిల్లా మజ్ధూర్‌మోర్చ అధ్యక్షురాలిగా కార్మిక సమస్యల పట్ల ఏమాత్రం అవగాహన లేని మహిళను నియమించడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చోటులేకుండా పోయిందన్నారు. జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు నాళం వెంకటేశ్వరరావు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.