గ్రూప్–2 పోస్టుల భర్తీకి సంబంధించి 1999 నోటిఫికేషన్ కింద ఈ నెల 20 వరకు నియామకాలు చేపట్టరాదని ఆంధ్రప్రదేశ్
ఏపీ సర్కారుకు ఏపీఏటీ ఆదేశం
హైదరాబాద్: గ్రూప్–2 పోస్టుల భర్తీకి సంబంధించి 1999 నోటిఫికేషన్ కింద ఈ నెల 20 వరకు నియామకాలు చేపట్టరాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్(ఏపీఏటీ) ఆదేశించింది. ఈ మేరకు ఏపీఏటీ సభ్యుడు జానకి రామారావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 2011లో గుర్తించిన ఖాళీల్లో పోస్టులను (రీఆప్షన్) ఎంచుకునే అవకాశం ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలిలో డీసీటీవోగా పని చేస్తున్న వై.హరికృష్ణ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. 1999 నోటిఫికేషన్ ప్రకారం పిటిషనర్ ఏపీటీవోగా ఎంపికయ్యారని, 2010 వరకు ఉన్న ఖాళీలను గుర్తించాలని హైకోర్టు, ట్రిబ్యునల్ ఆదేశాలి చ్చాయని పిటిషనర్ తరఫున న్యాయవాది నరసింహ వాదనలు వినిపించారు.
2011లో 111 ఖాళీలను గుర్తించారని, పిటిషనర్‌కు తిరిగి పోస్టులను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వలేదని, అందులో 79 పోస్టులు డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు పిటిషనర్ సొంత జోన్‌లోనే ఉన్నాయన్నారు. రీఆప్షన్ కోసం విజ్ఞప్తి చేసినా ఏపీపీఎస్‌సీ పట్టించుకోకుండా డిసెంబర్ 24న జాబితాను ప్రకటించిందని, ఈ నియా మకాలు జరిగితే పిటిషనర్‌కు అన్యాయం జరుగుతుం దని వివరించారు. అయితే పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి ఏపీపీఎస్‌సీ తరఫు న్యాయవాది గడువు కోరడంతో విచారణను జనవరి 20కి వాయిదా వేశారు. దీంతో అప్పటి వరకు 1999 నోటిఫికేషన్ ప్రకారం ఎటువంటి నియామకాలు చేపట్టరాదని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.