అధిష్టానం నిర్ణయాన్ని ప్రశ్నించొద్దు: డీఎస్
రాష్ట్ర విభజనను సమస్యను జటిలం చేయొద్దని ఏపీఎన్జీవోలను పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కోరారు. సమస్యలు ఉంటే ఆంటోనీ కమిటీకి చెప్పుకోవాలని సూచించారు. తెలుగుజాతి సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ఇరుప్రాంతాలపై ఉందన్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించవద్దని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులను కోరారు.
ఏపీఎన్జీవోల అనుమానాలను నివృత్తి చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి చర్చలు జరిపాలని డీఎస్ మంగళవారం సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం జరిగిపోయిందని అన్నారు. అన్నిస్థాయిల్లో చర్చలు జరిగాకే రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకుందని, దీనిపై వెనక్కి వెళ్లదని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనను ఆపాలనుకుంటే విఫలయత్నం అవుతుందన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను సీమాంధ్రులు అర్థం చేసుకోవాలని కోరారు.