అఖిలపక్షం అక్కర్లేదు: డి.శ్రీనివాస్
విభజన అమలు కోసమైతే ఓకే
తెలంగాణకు సహకరిస్తే సీమాంధ్రకు సంతృప్తికర ప్యాకేజీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని పునఃసమీక్షించే అంశంపై కేంద్రం మళ్లీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాల్సిన అవసర ం లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అన్నారు. విభజనపై రాజకీయ పార్టీలు యూటర్న్ తీసుకున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలంటూ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో విభేదించారు.
విస్తృత సంప్రదింపులు, అన్ని రాజకీయ పార్టీల ద్వారా రాతపూర్వక అభిప్రాయాలను సేకరించిన తర్వాతే కేంద్రం విభజన నిర్ణయం తీసుకుందని చెప్పారు. శనివారం సాయంత్రం తన నివాసంలో డీఎస్ మీడియాతో మాట్లాడారు. విభజన ప్రక్రియకు సహకరిస్తే సీమాం ధ్రకు సంతృప్తికరస్థాయిలో ప్యాకేజీ లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చిత్తశుద్ధితో ఉందని, బిల్లు రూపకల్పన అనంతరం దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. సీమాంధ్ర ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమ్మె విరమించిన సమైక్యాంధ్ర ఉద్యోగ సంఘాలను అభినందిస్తున్నట్లు చెప్పారు. విభజనవల్ల ఏయే సమస్యలు ఎదురవుతాయని సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారో వాటన్నింటికీ కేంద్ర మంత్రి వర్గ ఉపసంఘం పరిష్కార మార్గాలను చూపుతుందన్నారు. విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడు స్వాగతిస్తూ రాజనీతిజ్ఞత ప్రదర్శించిన చంద్రబాబు ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడటం బాధాకరమన్నారు.
గవర్నర్‌తో భేటీ: డీఎస్ శనివారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. నాలుగైదు రోజులుగా ఢిల్లీలో పర్యటించి హైకమాండ్ పెద్దలను కలిసి వచ్చిన డీఎస్ గవర్నర్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీ పరిణామాలు, సీఎం వ్యవహారం, విభజన ప్రక్రియ వంటి అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మర్యాదపూర్వకంగానే గవర్నర్‌ను కలిశానని, విజయ దశమి శుభాకాంక్షలు చెప్పి వచ్చానని డీఎస్ పేర్కొన్నారు.