రాజధాని కోసం పంట పొలాల విధ్వంసం తగదు
* జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి
తిరుపతి: రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం పంటల పొలాల విధ్వంసం తగదని, ప్రభుత్వ భూముల్లోనే నిర్మాణం చేపట్టాలని జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలోని యూటీఎఫ్ కార్యాలయంలో గురువారం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘ఏపీ రాజధాని-భూసేకరణ’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వుహించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహించారు. ఆయన రాజధాని ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాల రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు నష్టపోయే వైనాన్ని వివరించారు.
భూసమీకరణ ద్వారా కాకుండా భూసేకరణ చట్టం-2013ను అనుసరించి రాజధాని ఏర్పాటు జరగాలన్నారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. కార్పొరేట్, రియల్ ఎస్టేట్ కంపెనీలకు వేలాది ఎకరాలు దోచిపెట్టే భూయజ్ఞాన్ని ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ పంట భూములను ధ్వంసంచేసి రాజధానిని నిర్మించే ప్రయత్నం క్షంతవ్యం కాదన్నారు.