
పొత్తులొద్దు.. ఒంటరిగానే బరిలోకి వెళ్దాం
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోరాదని, ఒంటరిగా పోటీ చేస్తేనే పార్టీ ఎక్కువ స్థానాలు గెల్చుకుంటుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు వివరించారు. ఆపై వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితితో సహా ఎవరితోనూ పొత్తులు వద్దని చెప్పారు. మున్సిపాల్టీలను ఎక్కువగా కైవసం చేసుకోవడం ద్వారా సాధారణ ఎన్నికల్లోనూ విజయావకాశాలు మెరుగుపడతాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి బొత్స సత్యనారాయణ గురువారం తెలంగాణ ప్రాంత డీసీసీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, ఎంపీలు, మాజీ మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్‌వల్లనేనన్న అభిప్రాయం ప్రజల్లో కలిగించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు.
ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణనేతలు మరోసారి సమావేశమై కార్యాచరణ రూపొందించనున్నారు.పొత్తులకు సంబంధించి అధిష్టానం ఆలోచిస్తుందని, దానిపై మన అభిప్రాయాలు తప్ప నిర్ణయాలన్నీ ఢిల్లీలోనేనని బొత్స నేతలకు వివరించారు. తెలంగాణ ఇచ్చిందన్న క్రెడిట్ మొత్తం కాంగ్రెస్‌కే దక్కేలా నేతలు వ్యూహాన్ని రూపొందించాలన్నారు.మరో 20 రోజుల్లో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి... ఆ సభకు సోనియాగాంధీని, రాహుల్ గాంధీని ఆహ్వానించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రత్యేక పీసీసీలు ఏర్పాటుచేస్తారా? లేదా ఇదే పీసీసీని కొనసాగిస్తారా? ప్రత్యేక ప్రాంతీయ కమిటీలను ఏర్పాటుచేస్తారా? అనే అంశంపై ఒకటిరెండు రోజుల్లో అధిష్టానం ఒక నిర్ణయం తీసుకొనే అవకాశముందని బొత్స డీసీసీ అధ్యక్షులకు వివరించారు.