రానున్న మున్సిపల్, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు కసరత్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఆ ప్రాంత నేతలు గురువారం సాయంత్రం గాంధీభవన్లో సమావేశం కానున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో తమ ప్రాంతానికి ప్రత్యేక పీసీసీ ఏర్పాటు చేయకపోవడంపై పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడు బొత్స నాయకత్వంలో మీటింగ్కు హాజరు కావాలా ? వద్దా ? ఆ అనే అంశంపై సీనియర్లు ఆలోచనలో పడ్డారు.
అదికాక తెలంగాణ కోసం ఉద్యమించిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు అనంతరం కాంగ్రెస్లో విలీనం చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా కేసీఆర్ విలీనం చేసే ప్రసక్తే లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసేందుకు చేపట్టాల్సిన వ్యూహాలపై ఆ ప్రాంతం నేతలు నేటి సాయంత్రం గాంధీభవన్ లో సమావేశమై సమాలోచనలు చేయనున్నారు.