సాక్షి ప్రతినిధి, నెల్లూరు : లోక్‌సభలో అడుగు పెట్టాలనుకున్న వరప్రసాదరావు కోరిక రెండో ప్రయత్నంలో నెరవేరింది. 2009 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఆయన వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రెండో సారి ఇదే స్థానం నుంచి బరిలోకి దిగారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకంటే అధికంగా ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి జయరాం మీద 37,425 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గతంలో తనను ఓడించిన చింతా డిపాజిట్లు గల్లంతు చేశారు.
ఆ ఇద్దరికీ డిపాజిట్లు గల్లంతు
కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ చింతామోహన్‌కు ఈ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి. రామనారాయణరెడ్డికి ఆత్మకూరులో 8927 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆరు సార్లు తిరుపతి ఎంపీగా గెలిచిన చింతామోహన్‌కు ఈ ఎన్నికల్లో 33,333 ఓట్లు మాత్రమే లభించి ఘోర పరాజయం చవిచూశారు.
ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు
తిరుపతి లోక్‌సభ అభ్యర్థి విజయం విషయంలో 2009 ఎన్నికల నాటి పరిస్థితే పునరావృతమైంది. ఆ ఎన్నికల్లో ఈ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. ఒక్క సర్వేపల్లిలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదాల గెలిచారు. అయినా కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ ఎంపీగా సుమారు 20 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాదరావు విషయంలో ఇదే పునరావృతమైంది. తిరుపతిలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే వరప్రసాద్ 10,399 ఓట్లు అధికంగా సంపాదించారు. శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 7583 ఓట్ల మెజారిటీ వచ్చింది. అయితే వరప్రసాద్‌కు మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థి కంటే 9915 ఓట్లు అధికంగా వచ్చి బీజేపీ అభ్యర్థి కంటే 2332 ఓట్లు ఎక్కువ సంపాదించారు. సత్యవేడుపరిధిలో టీడీపీ అభ్యర్థి ఆదిత్య 4273 ఓట్లతో గెలుపొందారు. ఇక్కడ వరప్రసాద్‌కు బీజేపీ అభ్యర్థి కంటే 5183 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలం కంటే వరప్రసాద్‌కు 9456 ఓట్లు ఎక్కువ వచ్చాయి. సర్వేపల్లి నుంచి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధనరెడ్డి 5447 ఓట్ల మెజారిటీతో గెలిస్తే వరప్రసాద్‌కు 23,242 ఓట్ల ఆధిక్యత దక్కింది. అంటే ఎమ్మెల్యే అభ్యర్థి కంటే 17,795 ఓట్లు అధికంగా వచ్చాయి.
గూడూరులో సునీల్‌కుమార్‌కు 9,088 మెజార్టీ వస్తే ఎంపీ అభ్యర్థి వరప్రసాద్‌కు 19,786 ఓట్ల మెజార్టీ వచ్చింది. వెంకటగిరిలో టీడీపీ అభ్యర్థి 5,525 మెజార్టీతో గెలిస్తే వరప్రసాద్‌కు ఇక్కడ 2857 ఓట్లు అధికంగా వచ్చాయి. సూళ్లూరుపేటలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సంజీవయ్య 3726 ఓట్లతో గెలిస్తే వరప్రసాద్‌కు మాత్రం ఇక్కడ 13,898 ఓట్ల ఆధిక్యత దక్కింది. ఈ రకంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే ఎంపీ అభ్యర్థి వరప్రసాద్‌కు ఆధిక్యతలు వచ్చి బీజేపీ అభ్యర్థి జయరాంను 37,425 ఓట్ల తేడాతో వరప్రసాద్ ఓడించారు.
కల నెరవేరింది
Published Sat, May 17 2014 2:34 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement