పేరేచర్ల–కొండమోడు రహదారిలో ధూళిపాళ్ల వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి (ఫైల్)
సాక్షి, గుంటూరు: గత ఎన్నికల్లో 600 అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు మళ్లీ అదే సూత్రాన్ని అమలు చేస్తున్నారు. నాలుగేళ్లుగా కన్నెత్తి చూడని ప్రాజెక్టులు హఠాత్తుగా ఆయనకు ఇప్పుడు గుర్తుకొచ్చాయి. ఇందులో భాగమే నేడు పేరేచర్ల–కొండమోడు రహదారి విస్తరణ ప్రాజెక్టు శంకుస్థాపన.
పేరేచర్ల–కొండమోడు మార్గాన్ని ‘నాలుగు వరుసల రోడ్డుగా మారుస్తాం.. 50 కిలోమీటర్లు పొడవునా 22.5 మీటర్లు వెడల్పుతో తీర్చిదిద్దుతాం’ అంటూ గతంలో సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదు.
ఈ రహదారి విస్తరణకు గతంలో సర్వేలు చేపట్టారు. మేడికొండూరులో నాలుగు నుంచి ఐదు కిలో మీటర్లు, సత్తెనపల్లిలో 11 కిలోమీటర్ల మేర బైపాస్ నిర్మాణానికి ప్రతిపాదించారు. ఈ మేరకు రూ.512 కోట్లతో గతంలో టెండర్లు పిలిచినా ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదు.
కప్పం కట్టలేక కాంట్రాక్టర్ల వెనుకంజ..
రూ. 500 కోట్లకుపైగా నిధులతో చేపట్టనున్న ప్రాజెక్టుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న వారు అధికార పార్టీ కీలక నేత తనయుడికి భారీగా కమీషన్ల ఇవ్వాల్సి రావడంతో ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదు.
నడికుడి– శ్రీకాళహస్తి రైల్వేలైన్ నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌ను కమీషన్‌ల కోసం ముఖ్యనేత తనయుడు వేధించిన తీరును చూసి మిగిలిన కాంట్రాక్టర్లు వెనక్కి తగ్గినట్లు తెలిసింది.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేరేచర్ల–కొండమోడు రోడ్డు విస్తరణకు నోచుకోకపోవడంతో నాలుగున్నరేళ్లలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంత మంది వికలాంగులయ్యారు. ఈ రహదారి నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారడమే దీనికి కారణం.
మేడికొండూరు భీమినేనివారిపాలెం వద్ద గత ఏడాది మే 5వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది ఆగస్టు 27న సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఇలా అనేక మంది ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలయ్యారు. ఈ రోడ్డు ప్రమాదాలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో నిలదీసినప్పటికీ పాలకుల్లో చలనం రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment