
వలస వెళుతున్న బొల్లాపల్లి మండలం తండావాసులు ,బొల్లాపల్లి మండలం గుండిగనుమలలో కుటుంబం వలస వెళ్లడంతో తాళం వేసి ఉన్న ఇల్లు గుంటూరు
జిల్లాలో అనేక ప్రాంతాల్లో పేదరికం విసిరిన బతుకులు వలసదారుల్లో తరలిపోతున్నాయి. పండుగలాంటి పల్లె వాకిట పస్తుల తోరణాలు వేలాడుతున్నాయి. కరువు రక్కసి నోట చిక్కిన ఇళ్లు.. తాళం బుర్రలు కప్పుకుని కన్నీరొలుకుతున్నాయి. వానజాడ లేక, సాగర్ నీళ్లు రాక తడారిన పంట పొలాలు నెర్రెలిచ్చి ఘొల్లుమంటున్నాయి. ఎటు చూసినా ప్రభుత్వం నిర్దయకు గురైన పల్లెలు, ఆసరా కరువైన రైతుల బతుకులు, పనుల్లేక పస్తులు నిండి ఎండిన కూలీల డొక్కలు.. అన్నం ముద్దకై సొంత గూటిని, కన్న ఊరిని వదిలి కన్నీరై కదిలిపోతున్నాయి.. మెతుకు దొరికే తావు చూపండయ్యా అంటూ ఏకరువు పెడుతున్నాయి.
సాక్షి, అమరావతి బ్యూరో: తీవ్ర వర్షాభావ పరిస్థితు నేపథ్యంలో జిల్లాలో ఎన్నడూలేని విధంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా వ్యాప్తంగా 40 శాతం లోటు వర్షపాతం 54 మండలాల్లో ఏర్పడింది.అధికారులు 13 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వీటిలో 11 మండలాలను మాత్రమే ప్రభుత్వం ప్రకటించింది. బొల్లాపల్లి, చిలకలూరిపేట, దుర్గి, యడ్లపాడు, రెంటచింతల, రొంపిచర్ల, శావల్యాపురం మండలాలు మాత్రమే ఉన్నాయి. జల్లాలో గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి, మాచవరం, పిడగురాళ్ల రూరల్, నూజెండ్ల, ఈపూరు, నాదెండ్ల వంటి మండలాలు కరువుతో అల్లాడుతున్నాయి.
కరువు మండలాలకు అందని సాయం
వెల్దుర్తి, మాచర్ల, బొల్లాపల్లి మండలాలలో తాగు నీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఏ పంటనైనా వేసుకొండి సాగు నీరిస్తామని సీఎం నారా చంద్రబాబు భరోసా ఇచ్చారు. దీంతో అప్పటికే సాగులో ఉన్న పత్తి, కంది పంటలను దున్నేసిన రైతులు మాగాణి సాగు చేశారు. అనంతరం అక్టోబరు 25వ తేదీ నుంచి మాగాణి పంటలు సాగు చేస్తే నీటి సరఫరా చేయలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. నవంబరు నుంచి వారబందీ విధానం ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ విధానం ప్రస్తుతం రైతులకు శాపంగా మారింది. వినుకొండ, నరసరావుపేట ప్రాంతాలలో వరి పొలాలు నెర్రెలిచ్చాయి.
ఉపాధి పనులెక్కడ ?
కరువు మండలాల్లో పని దినాలను 200లకు పెంచాలి. వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో పనుల్లేక ప్రజలు వలస బాట పడుతున్నారు. ఈ ప్రాంతంలో కరువు బియ్యం, పశుగ్రాసం అందించాలి. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలి. ఇన్‌పుట్ సబ్సిడీ కోసం, కరువు మండలాల్లో ఎంత మేర నష్ట వాటిల్లిందో సర్వే నిర్వహించాలి. రబీలో పంటలు సాగు చేసేందుకు సబ్సిడీపైన విత్తనాలు సరఫరా చేయాలి. ప్రభుత్వం మాత్రం కరువు మండలాలు ప్రకటించి చేతులు దులుపుకుంది.
బొల్లాపల్లి మండలంలో..
బొల్లాపల్లి మండలంలో 11,500 హెక్టార్లు సాగులో ఉంది. అయితే 3 వేల హెక్టార్లలో పత్తి సాగు చేస్తే 2 వేల హెక్టార్ల వరకు నష్టపోయింది. మిరప 4 900 హెక్టార్లకుగాను 2500, కంది 1650 హెక్టార్లకుగాను 900, మిగిలిన రకాలు 500 హెక్టార్లకుగాను 300 హెక్టార్లతో పంట దెబ్బతింది. ఇంకా లింగంగుంట తండా, చెంచుకుంట తండా, పాపాయపాలెం, వీరప్పకుంట తండా, హనుమాపురం తదితర తండాల నుంచి ఉపాధి కరువై పొట్ట చేత పట్టుకుని పనుల కోసం వలస వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment