శ్రీకాకుళం :జిల్లాలో సోమవారం జరిగిన డీఎస్సీ పరీక్షలో స్కూల్ అసిస్టెంట్(తెలుగు) పోస్టుకు రాసిన వి.రజితాసంపతిరావు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడడం వాస్తవమేనని ఏజెసీ పి.రజనీకాంతారావు, విద్యాశాఖ ఆర్జేడీ ప్రసన్నకుమార్ ప్రాథమికంగా నిర్థారించారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ఆ అభ్యర్థిపై పోలీసులు కేసు పెట్టిన విషయం పాఠకులకు తెలిసిందే. ఇదే విషయంపై మంగళవారం సాక్షిలో ‘డీఎస్సీ పేపర్ లీక్’ పేరిట ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి రాష్ట్ర అధికారులు స్పందించి ఆర్జేడీని ప్రాథమికంగా విచారణ జరపాలని ఆదేశించారు.
జిల్లా నుంచి కూడా ఓ అధికారిని పంపాలని కలెక్టర్‌కు సూచించడంతో ఆయన ఏజెసీని విచారణాధికారిగా నియమించారు. మంగళవారం వీరిద్దరూ తొలుత ఏజెసీ చాంబర్‌లో సమావేశమై అటు తరువాత డీఈవో కార్యాలయంలో పలువురి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ మాల్‌ప్రాక్టీస్ జరిగిన విషయం వాస్తవమేనని జవాబులు పరీక్ష గదిలోకి ఎలా వచ్చాయన్న దానిపైనా, ఇందులో ఎవరి ప్రమేయం ఉందన్న దానిపైనా లోతుగా విచారించాల్సి ఉందన్నారు. ప్రాథమిక నివేదికను రాష్ట్ర అధికారులకు బుధవారం నివేదిస్తామని తెలిపారు. ఇదే అభ్యర్థి తెలుగు పండిట్
పోస్టుకు కూడా పరీక్ష రాశారని అందులో ఉత్తీర్ణత సాధిస్తే పోస్టింగ్ ఇస్తారా, అక్కడ కూడా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడినట్టు భావిస్తారా అని కొందరు విలేకరులు ప్రశ్నించగా ఈ విషయం కూడా తమ దృష్టికి వచ్చిందని వారు పేర్కొన్నారు. దీనిని నివేదికలో పొందుపరుస్తామని నిర్ణయం రాష్ట్రస్థాయిలో జరుగుతుందన్నారు.
మాల్‌ప్రాక్టీసుకు పాల్పడ్డ అభ్యర్ధి నుంచి వివరాల సేకరణ
మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన రజితా సంపతిరావు నుంచి అధికారులు పలు వివరాలు సేకరించారు. ఆమె నుంచి ఆ వివరాలను లిఖితపూర్వకంగా తీసుకున్నారు. విచారణాధికారుల వద్దకు న్యాయవాదితో కలసి వచ్చినప్పటికీ విచారణాధికారులు న్యాయవాదిని విచారణ గదిలోకి అనుమతించలేదు. అటు తరువాత ఆమెను ఒకటవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వారడిగిన వివరాలు ఇవ్వాలని అధికారులు సూచించారు. పోలీసులు కూడా ఆమె నుంచి వివరాలను సేకరించారు.
తోటి అభ్యర్థుల నుంచి సమాచార సేకరణ
సోమవారం జరిగిన సంఘటనకు సంబంధించి అదే గదిలో పరీక్ష రాస్తున్న ఇతర అభ్యర్థుల నుంచి లిఖితపూర్వకంగా సమాచారం తీసుకున్నారు. వీరంతా ఆమె మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడడం వాస్తవమేనని, రెండుసార్లు బాత్‌రూమ్‌కు వెళ్లి వచ్చారని చెప్పడంతో పాటు సంఘటనకు సంబంధించి అన్ని వివరాలను అధికారులకు తెలిపారు.
ఇచ్ఛాపురం, శ్రీకాకుళం ఎంఈవోలనుంచీ పలు విషయాలు ఆరా
మాల్‌ప్రాక్టీస్‌కు సంబంధించి ఇచ్ఛాపురం ఎంఈవో లక్ష్మీనారాయణ, శ్రీకాకుళం ఎంఈవో విజయలక్ష్మిలను కూడా విచారణాధికారులు పలు విషయాలపై ఆరా తీశారు. ఇచ్ఛాపురం ఎంఈవో లక్ష్మీనారాయణ పరీక్ష ప్రారంభానికి గంట ముందు వచ్చి బాత్‌రూమ్‌లు ఎక్కడ ఉన్నాయని శ్రీకాకుళం ఎంఈవోను ప్రశ్నించడం, తన కోడలిగా రజితా సంపతిరావును ఇచ్ఛాపురం ఎంఈవో శ్రీకాకుళం ఎంఈవోకు పరిచయం చేయడం వంటి విషయాలు విచారణాధికారులకు తెలియడంతో ఆ విషయాలపై లిఖిత పూర్వకంగా వివరాలు తీసుకున్నారు.
అన్ని ప్రాంతాలు పరిశీలన
పరీక్ష జరిగిన గదితో పాటు బాత్‌రూమ్‌లు, పాఠశాల ఆవరణను విచారణాధికారులు పరిశీలించారు. బయట నుంచి ఏ విధంగా స్లిప్పు లోనికి వచ్చే సాధ్యాసాధ్యాలను అక్కడ ఉన్నవారి నుంచి సేకరించారు.
పరీక్ష రద్దుకు పలువురు డిమాండ్:
డీఎస్సీ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పలువురు విచారణాధికారులను డిమాండ్ చేశారు. బాలికోన్నత పాఠశాలలో ఓపెన్‌స్కూల్ పేపర్ల మూల్యాంకనం జరుగుతోంది. అందులో హాజరైనా కొందరు ఉపాధ్యాయులు ప్రస్తుత డీఎస్సీ కూడా రాయడంతో వారు విచారణాధికారుల ముందుకు వచ్చి పలు సమాచారాన్ని అందించారు. తమకు అన్యాయం చేయవద్దని తామెంతో కష్టపడ్డామని చెప్పారు.
సెల్‌ఫోన్ వినియోగించారా?
అభ్యర్థికి వచ్చిన ప్రశ్నపత్రం కోడ్ బయటకు వెళితేనే జవాబులు లోపలకు వచ్చే అవకాశం ఉందని భావించిన విచారణాధికారులు అభ్యర్థి సెల్‌ఫోన్ వినియోగించారా అనే కోణంలో కూడా విచారణ జరిపారు. ఇది నిర్థారణ కాకపోయినప్పటికీ కచ్చితంగా సెల్‌ఫోన్ వినియోగించి ఉండవచ్చని భావించారు. ప్రశ్నపత్రం బయటకు వెళ్లిందా అనే విషయంపైన కూడా దృష్టి సారించి దర్యాప్తు జరిపారు.
మాల్ ప్రాక్టీస్ వాస్తవమే
Published Wed, May 13 2015 12:53 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement