
డీఎస్సీ ఫలితాల తుది షెడ్యూల్ విడుదల
డీఎస్సీ-2014 ఫలితాల తుది షెడ్యూల్‌ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు.
♦ 26న సర్టిఫికెట్ల పరిశీలన.. 28న తుది జాబితా
♦ 29, 30, 31 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్
♦ జూన్ 1న అభ్యర్థులకు నియామక పత్రాలు: గంటా
సాక్షి, విజయవాడ బ్యూరో: డీఎస్సీ-2014 ఫలితాల తుది షెడ్యూల్‌ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థులకు జూన్ 1న నియామక పత్రాలు అందిస్తామని చెప్పారు. ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 2014లో టెట్, టెర్ట్(డీఎస్సీ) నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలిపారు. కోర్టు కేసుల వల్ల వాటి తుది ఫలితాలను ప్రకటించలేకపోయామని అన్నారు. న్యాయపరమైన అన్ని అంశాలు పరిష్కారం కావడంతో డీఎస్సీ-2014 ఫలితాల ఫైనల్ షెడ్యూల్‌ను విడుదల చేసినట్టు వెల్లడించారు.
ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 26న జరుగుతుందన్నారు. 28న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. వారికి ఈ నెల 29, 30, 31 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి జూన్ 1న నియామక పత్రాలు అందిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సమక్షంలో నియామక పత్రాలు అందజేసి, జూన్ 2 నుంచి శిక్షణ ఇస్తామన్నారు. ‘నీట్’పై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో 23 రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయని, ఈ ఏడాదికి ఎంసెట్ ప్రాతిపదికగా ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయాలని ప్రతిపాదించాయని వివరించారు. అవసరమైతే ఆర్డినెన్స్ తెచ్చి, సుప్రీంకోర్టుకు తీర్పునకు లోబడి, ఎంసెట్ ఫలితాలను బట్టి ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.