కుమారుడి దైన్యం..తండ్రి విజయం | DSC State 29th Rank Sunil Success Story | Sakshi
Sakshi News home page

కుమారుడి దైన్యం..తండ్రి విజయం

Published Mon, Mar 26 2018 10:43 AM | Last Updated on Mon, Mar 26 2018 10:43 AM

DSC State 29th Rank Sunil Success Story - Sakshi

అంగవైకల్యం ఉన్న కుమారుడితో...

 అతడి సంకల్పబలం ముందు పేదరికం ఓడిపోయింది. మనోధైర్యమే ముందుకు నడిపింది. దివ్యాంగుడైన కొడుకుకు వైద్యం చేయించడమే లక్ష్యమైంది. లక్ష్యసాధనకు స్నేహితుడి సహకార హస్తం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తోడైంది. చదువే ఊపిరైంది. 16 గంటలసేపు పుస్తకాలతో గడిపేలా చేసింది. విజయలక్ష్మి తలుపుతట్టింది. డీఎస్పీ పదవిలో అలంకరించింది. ఏపీపీఎస్పీ గ్రూప్‌–1 –2016 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 29వ ర్యాంకు సాధించిన జగ్గయ్యపేట బూదవాడకు చెందిన బూడిద సునీల్‌ విజయప్రస్థానంపై ప్రత్యేక కథనం.

జగ్గయ్యపేట: గ్రూప్స్‌–1లో ఎంపికైన సునీల్‌ విజయ యాత్రపై ఆయన మాటల్లోనే.. నాది జగ్గయ్యపేట మండలం బూదవాడ గ్రామం. నిరుపేద కుటుంబం లో పుట్టాను. నాన్న 11 ఏళ్ల క్రితం చనిపోవడంతో మా అమ్మ కూలీనాలీ చేస్తూ చదివించింది. ఒకటి నుంచి ఐదు వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇంటర్‌ జగ్గయ్యపేటలోని జేఆర్సీ కళాశాల, డిగ్రీ కూడా జగ్గయ్యపేట విశ్వభారతి కళాశాలలో బీఎస్సీ, బీజడ్‌సీలో 80 శాతం మార్కులు సాధించాను.

కొడుకు పుట్టుకతోనే....
కొడుకు పుట్టుకే గ్రూప్స్‌కు సిద్ధం చేసింది. డిగ్రీ పూర్తవగానే ఐదేళ్ల పాటు గ్రామంలోని జేపీ సిమెంట్స్‌ కర్మాగారంలో ప్రైవేట్‌ ఉద్యోగం చేశాను. 2012లో శ్యామలతో వివాహమైంది. ఇద్దరు మగ పిల్లలు. పెద్ద కుమారుడు పుట్టుకతోనే చెవుడు, కళ్లు కనిపించని లోపంతో పుట్టాడు. కుమారుడికి మెరుగైన వైద్యం చేయించాలని నిశ్చయించుకున్నాను. కుటుంబ సభ్యులతో మాట్లాడి గ్రూప్‌–1కు ప్రిపేరవుతానని సహకరించాలని కోరాను. వారు కూడా అంగీకరించడంతో పాటు తన ఇంటర్‌ స్నేహితుడు లాహోరు నరసింహారావు ఆర్థికంగా సహకరించడంతో ముందడుగు వేశాను.

రెండేళ్లుగా హైదరాబాద్‌లో..
2016లో గ్రూప్స్‌ పరీక్షలు రాసేందుకు గ్రామం విడిచి హైదరాబాద్‌కు వెళ్లిపోయాను. రెండేళ్లపాటు పిల్లలకు, భార్యకు దూరంగా ఉండి పట్టుదలతో గ్రూప్‌– 1కు సిద్ధమయ్యాను. రాత్రింబవళ్లు చదివా. నా కుమారుడి లోపమే కళ్లముందు కదలాడింది. ఉద్యోగ సాధనే లక్ష్యంగా కదిలాను. నిత్యం పత్రికలు, రాజ్యసభ టీవీ కార్యక్రమాల వీక్షణతోపాటు ఎన్‌సీఆర్టీ పుస్తకాలను రోజుకు 16 గంటలు చదివేవాడిని. 2016 డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 2017లో ప్రిలిమ్స్‌కు, ఆగస్టులో మెయిన్స్‌కు అర్హత సాధించడంతో  ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఎంపికయ్యాను.

మౌఖిక పరీక్ష ఇలా..
ఇంటర్వ్యూలో వ్యక్తిగత అంశాలతో పాటు జిల్లా, జాతీయ, అంతర్జాతీయ కరంట్‌ అఫైర్స్‌పై అనేక ప్రశ్నలు అడిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వంటి అంశాలు కూడా స్పృశించారు. స్థానిక అంశాలపై కూడా ప్రశ్నలు అడిగారు.

వ్యక్తిగత శ్రద్ధే విజయానికి సోపానం
కోచింగ్‌ కేంద్రాల్లో  నేర్పించే అంశాలు 15 నుంచి 20 శాతం మేర మాత్రమే ఉపయోగపడతాయి. 80 శాతం వ్యక్తిగతంగా చదువుకుంటే ఎంచుకొన్న లక్ష్యాన్ని అదిగమించవచ్చు. యువత కూడా ప్రస్తుతం చదువులో ఛాలెంజ్‌గా తీసుకోవాలి.

ఆ ముగ్గురు..
నా విజయ యాత్రలో ముగ్గురున్నారు. పుట్టుక లోపం కలిగిన నా కుమారుడు, వాడిని రెండేళ్లు నేను లేని లోటు లేకుండా చూసుకున్న నా భార్య శ్యామల ఆమె కుటుంబ సభ్యులు, మూడో వ్యక్తి నా స్నేహితుడు నరసింహారావు.

సునీల్‌ ఆదర్శం
సునీల్‌ ఇంటర్‌లో పరిచయమయ్యాడు. నాకు డిగ్రీ పూర్తవగానే ఎస్‌బీఐలో ఉద్యోగం వచ్చింది. సునీల్‌ గ్రూప్స్‌కు సిద్ధమవుతున్నాడని తెలిసి ఆర్థికంగా సహాయపడ్డాను. అతడిని యువత ఆదర్శంగా తీసుకోవాలి.– లాహోరి నరసింహారావు, సునీల్‌ స్నేహితుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement