మెట్‌పల్లి రూరల్/మల్లాపూర్/ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : వడగండ్ల వాన కడగండ్లు మిగిల్చింది. గురువారం రాత్రి, శుక్రవారం కురిసిన అకాల వడగండ్లతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరబెట్టిన పసుపు తడిసిపోగా, నువ్వులు, మొక్కజొన్న, మిర్చి పంటలు
పూర్తిగా నేలవాలిపోయాయి. మామిడి పూత, పిందె రాలిపోయింది. మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్ తదితర మండలాల్లో శుక్రవారం కురిసిన వడగండ్ల వానతో పంటలు భారీగా నష్టపోయాయి.
వడగండ్ల ధాటికి మొక్కలు విరిగిపోయాయి. మెటపల్లి మండలంలో నువ్వులు, మొక్కజొన్న, సజ్జ, వరి, తదితర పంటలు వంగిపోయాయి. మల్లాపూర్ మండలకేంద్రంలో, ధర్మారం, చిట్టాపూర్, ముత్యంపేట, గుండంపల్లి, రేగుంటలో మిర్చి, నువ్వులు, మొక్కజొన్నతోపాటు ఉడకబెట్టిన పసుపు తడిసింది.
ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి శివారులో కోరుట్ల నుంచి పోచంపాడుకు వెళ్లే 133/33 కేవీ విద్యుత్ టవర్ కూలిపోయింది. పలుచోట్ల వంద 11 కేవీ విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలవాలాయి. వర్షకొండ, ఎర్దండి, కోమటికొండాపూర్, కోజన్‌కొత్తూర్, కేశాపూర్‌లో అంధకారం నెలకొంది. వడగండ్లు పడడంతో కోజన్‌కొత్తూర్‌కు చెందిన గుజ్జి రాజమల్లు, పిండి లక్ష్మి, పిండి కవిత, లక్కడి చిన్నారెడ్డి, భీంరాజ్, రాజు, రావులు, ఆవుల నడ్పిగంగు, రాజుబాయి, బురుగు లక్ష్మీరాజం, వేములకుర్తికి చెందిన ఆరె లక్ష్మీరాజం, వర్షకొండకు చెందిన చెక్కిల్ల నర్సాగౌడ్‌తోపాటు బర్దిపూర్‌లో గొర్రెల కాపరులు గాయపడ్డారు. గొర్రెలకు గాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఆరబోసుకున్న పసుపు తడిసింది. ఎర్దండిలో రోడ్లపై పడిన చెట్లను సర్పంచ్ దాసరి రాజవ్వరాజన్న జేసీబీతో తొలగించారు. వర్షకొండలో బూస శంకర్, గూనోల్ల పద్మ ఇంటి రేకులు ఈదురు గాలులకు కొట్టుకుపోయాయి. దెబ్బతిన్న పంటలను ఏడీఏ రాజేశ్వర్ పరిశీలించారు. మండలంలో 1535 హెక్టార్లలో పంటనష్టం జరిగిందన్నారు.
కథలాపూర్ : అకాలవర్షం రైతులను కన్నీటిపాలు చేసింది. వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. పెగ్గెర్ల శివారులో మిరప, ఉల్లి పంటలకు నష్టం వాటిల్లింది. ఇళ్లలోకి వర్షంతో కూడిన వడగండ్లు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పలు గ్రామాల్లో ఆరుబయట పోసిన పసుపు, పొద్దుతిరుగుడు పంటలు తడిసిపోయాయి.సారంగాపూర్ : వడగండ్ల వానకు రేచపల్లిలో 50 ఎకరాల్లో మొక్కజొన్న కర్రలు విరిగి నేలవాలింది. మంగళారపు గంగన్న, మామిడి రాజేశం, గాజునాయక్, పోతుగంటి తిరుపతి తదితర రైతుల పంటలు దెబ్బతిన్నాయి. బబ్బెర, మామిడికి నష్టం వాటిల్లింది. మామిడి పూత పిందెలు వడగండ్ల ధాటికి రాలిపోయాయి.
వడగండ్ల వాన
Published Sat, Mar 1 2014 3:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM
Advertisement