మిర్యాలగూడ, న్యూస్‌లైన్:కృష్ణా-గోదావరి జలాల అనుసంధానం పేరుతో కృష్ణానది మిగులు జలాల్లో కోత విధించే ప్రయత్నం మొదలైంది. ఇప్పటికే బ్రిజేష్‌కుమార్ తీర్పు ప్రకారం నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలో 145 టీఎంసీల నీటిని వచ్చే ఏడాదికి నిల్వ చేసుకోవాలి. దీంతో మిగులు జలాల ఆధారంగా నల్లగొండ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీకి చుక్కనీరు కూడా వచ్చే అవకాశాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రాజెక్ట్ టెక్నికల్ కమిటీ నిర్ణయం మేరకు 2018 లోగా ప్రాజెక్ట్ పూర్తికి ప్రభుత్వం గడువు పొడిగించింది. దీంతో నల్లగొండ జిల్లా ప్రజల్లో మళ్లీ అలజడి మెదలైంది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో అదనంగా ఒక్క ఎకరానికి నీరు రాక పోగా, భూసేకరణ కోసం పంట భూములు కోల్పోవలసి వస్తుంది.
దుమ్ముగూడెం-టెయిల్‌పాంట్ ప్రాజెక్టు ద్వారా 165 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకునే అవకాశం ఉందంటూ టెక్నికల్ కమిటీ పేర్కొనడం కృష్ణా జలాల్లో కోత విధించడానికే అని స్పష్టంగా తెలుస్తుంది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం గతంలో రూ. 19,521 కోట్లకు అంచనా వేయగా, ప్రస్తుతం అది సుమారు రూ. 30 వేల కోట్లకు చేరింది. వాస్తవానికి 2009లోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని భావించగా, నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. అప్పటి సీఎం రోశయ్యను కలిశారు. దీంతో పనులు నిలిచిపోయాయి. ఇదే సమయంలో 2014లోగా ప్రాజెక్టు పూర్తి చేయాలనే గడువు దగ్గరికి వచ్చింది. దీంతో టెక్నికల్ కమిటీ సూచనల మేరకు ఇటీవల ప్రాజెక్టు నిర్మాణ గడువు 2018 సంవత్సరానికి పెంచారు.
ఎత్తిపోతలు సాధ్యమయ్యేనా?
దుమ్ముగూడెం ప్రాజెక్టు భాగంగా ఖమ్మం జిల్లా బయ్యారం నుంచి నాగార్జునసాగర్ దిగువన నల్లగొండ జిల్లాలోని హాలియా సమీపంలో ఉన్న టెయిల్‌పాండ్ ప్రాజెక్టులోకి లింకు కాలువ ను ఏర్పాటు చేయాలి. దీని కోసం 244 కిలోమీటర్ల పొడువునా కాల్వ తవ్వకం పనులు చేపట్టాలి. అంతే కాకుండా మొత్తం 127 మీటర్ల ఎత్తులో ఎత్తిపోతల పథకాలు పనిచేయాల్సి ఉంది. అందుకు 1,136 మెగావాట్ల విద్యుత్ కూడా అవసరమవుతుంది. ఖమ్మం జిల్లాలోని మొద్దులగూడెం (19 మీటర్ల ఎత్తు), కళ్యాణపురం (16 మీటర్ల ఎత్తు), రేగల్ల (25 మీటర్ల ఎత్తు), ఒడ్డుగూడెం (12 మీటర్ల ఎత్తు), కోయగూడెం (19 మీటర్ల ఎత్తు), బయ్యారం వద్ద 35 మీటర్ల ఎత్తున ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారీగా నిర్మించే ఎత్తిపోతల పథకాలు పని చేసే పరిస్థితులు లేవు.
ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భూసేకరణ
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కాలువ తవ్వకానికి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలో 3,701 ఎకరాల అటవీభూమి, 16,084 ఎకరాల ప్రైవేటు భూమిని రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఈ పనులను 10 ప్యాకేజీలుగా విభజించారు. ఖమ్మం జిల్లాలో 1 నుంచి 6 ప్యాకేజీలు (159.80 కిలోమీటర్లు), నల్లగొండ జిల్లాలో 7 నుంచి 10వ ప్యాకేజీ వరకు 84 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. కాగా, ఖమ్మం జిల్లాలోని బయ్యారం నుంచి ప్రారంభమవుతున్న ఈ లింకు కాలువ బయ్యారం, గార్ల, తిమ్మాయిపాలెం మీదుగా నల్లగొండ జిల్లాలోని మోతె మండలానికి ప్రవేశించి అక్కడి నుంచి చివ్వెంల, మునగాల, పెన్‌పహాడ్, వేములపల్లి, త్రిపురారం, నిడమనూరు, అనుముల మీదుగా టెయిల్‌పాండ్ ప్రాజెక్టులో కలుస్తుంది.
సాగర్ ఆయకట్టును దీని పరిధిలో చూపేందుకు ప్రయత్నం
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు దిగువభాగంలో ఉన్న టెయిల్‌పాండ్ ప్రాజెక్టులో ఈ లింకు కాలువను కలిపినా, దాని పరిధిలోని ఆయకట్టు పూర్తిగా దీని కిందనే ఉన్నట్లు టెక్నికల్ కమిటీ చూపేందుకు ప్రయత్నిస్తుందనే ఆరోపణలున్నాయి. టెయిల్‌పాండ్ వద్ద ఉన్న రివర్సబుల్ టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు ఆయకట్టుకు నీటిని వినియోగించుకోవచ్చని వారి లెక్కల్లో పేర్కొన్నారు. వరదల సమయంలోనే కేవలం 80రోజుల్లో మాత్రమే నీటిని మళ్లించే అవకాశముండే ఈ ప్రాజెక్టు పరిధిలోకి 14,12,870 ఎకరాల ఆయకట్టు చూపిస్తున్నారు. టెక్నికల్ కమిటీ సూచనల మేరకు తెలంగాణ ప్రాంతంలో 8,53,870 ఎకరాలు (ఖమ్మం జిల్లాలో 2,05,200 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 3,68,070 ఎకరాలు (ఎడమకాల్వ పరిధి), నల్లగొండ జిల్లాలో 2,80600 ఎకరాలు), ఆంధ్రా ప్రాంతంలో 5,59,000 ఎకరాలు (గుంటూరు జిల్లాలో 3,40,000 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 2,19,000 ఎకరాలు ఆయకట్టును చూపుతున్నారు. కానీ వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు సాగుకు ఈ నీరు ఏ విధంగా ఉపయోగపడే అవకాశాలు లేవు.
ప్రాజెక్టుపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: జూలకంటి రంగారెడ్డి, ఎమెల్యే మిర్యాలగూడ
దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ ప్రాజెక్టుతో నల్లగొండ జిల్లాకు ఎలాంటి ఉపయోగం లేదు. పనులు నిలిపివేయాలని గతంలోనే అప్పటి సీఎం రోశయ్యకు వినతిపత్రం ఇచ్చాం. ఇటీవల సీఎం కిరణ్‌ను కూడా కలిశాం. ఈ ప్రాజెక్ట్ నల్లగొండ జిల్లా ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందో టెక్నికల్ కమిటీ చెప్పిన విషయాలను ప్రభుత్వం అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి వివరించాలి. ప్రజలు అడిగిన ప్రాజెక్టులను నిర్మించని ప్రభుత్వం అవసరం లేని దానిని నిర్మించే ప్రయత్నం విరమించుకోవాలి.