
దుర్గమ్మ దర్శన వేళలు పెంపు
జగజ్జనని దుర్గమ్మ దర్శన వేళలను పెంచుతూ దేవస్థానం నిర్ణయం తీసుకుంది.
ఇంద్రకీలాద్రి : జగజ్జనని దుర్గమ్మ దర్శన వేళలను పెంచుతూ దేవస్థానం నిర్ణయం తీసుకుంది. రాష్ర్ట రాజధానిగా అమరావతిని ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అమ్మవారి దర్శనానికి విశేషంగా తరలివస్తున్నారు. దీనికితోడు రెండు నెలలుగా సాధారణ భక్తుల సంఖ్య కూడా పెరిగింది. శుక్ర, ఆదివారాల్లో భక్తులు 40 నుంచి 50వేల వరకు వస్తుండటంతో దర్శనానికి ఇబ్బందికరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆ రెండు రోజులు దర్శన వేళలను పెంచుతూ ఈవో నర్సింగరావు నిర్ణయం తీసుకున్నారు.
సాధారణంగా రాత్రి 9 గంటల వరకే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఇకపై శుక్ర, ఆదివారాల్లో తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారితో పాటు మల్లేశ్వరస్వామి, ఇతర ఉపాలయాల్లో దర్శన భాగ్యం కల్పిస్తారు. దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలను ఏఈవో స్థాయి అధికారులు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. కొండపై భక్తుల రద్దీకి అనుగుణంగా ఘాట్‌రోడ్డుపైకి వాహనాలను అనుమతించాలా, వద్దా అనేది ఏఈవోలు నిర్ణయిస్తారు. శుక్ర, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొండపైకి ప్రయివేటు రవాణా వాహనాలతో పాటు కార్లు నిలిపివేస్తారు. 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అంతరాలయ దర్శనాన్ని కూడా నిలిపివేస్తారు.