ప్రభుత్వ ఉద్యోగులు/ అధికారులకు సర్వీసు పరమైన సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి నెలా ఒకటవ తేదీన టంచన్‌గా వేతనం పొందడంతో పాటు, ఉద్యోగ విరమణ చేసే రోజునే బెనిఫిట్స్ అన్నీ చేతికందేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టం (హెచ్‌ఆర్‌ఎంఎస్) స్థానంలో హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (హెచ్‌సీఎం) అనే నూతన ఆర్థిక విధానాన్ని జూన్ నెల నుంచి అమలు చేసేందుకు ఆర్థిఖ శాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖల ఉద్యోగ, అధికారులు ‘ఈ–ఎస్‌ఆర్’ పొందేందుకు వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
సాక్షి, మచిలీపట్నం: సర్వీసు రిజిస్టర్ పుస్తకాలతో పనిలేకుండా చేతిలో ఉన్న ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్‌లో ఒక్క క్లిక్ చేస్తే తమ సర్వీసుకు సంబంధించిన సమస్త సమాచారం కనిపిస్తుంది. ఆన్‌లైన్‌లోనే ఉద్యోగుల సర్వీసు పరమైన వివరాలను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఉద్యోగి/అధికారి ప్రభుత్వ కొలువులో చేరిన నాటి నుంచి పదవీ విరమణ వరకు పుస్తక రూపంలో ఉన్న సర్వీసు రిజిస్టర్‌ను ఉద్యోగ కాలం మొత్తంగా అంటే 30 నుంచి 35 ఏళ్ల పాటు ఎంతో జాగ్రత్తగా భద్రపరచాల్సి వస్తోంది. ఏదైనా అనుకోని ఘటనల్లో సర్వీసు రిజిస్టర్ పోతే అనేక చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయా శాఖల్లోని సీనియర్ అసిస్టెంట్లు, అక్కడ నుంచి డీడీఓలు, అటు తరువాత ఎస్టీఓ, డీటీఓ ఇలా పలువురి వద్దకు ఎస్‌ఆర్ వెళితేనే కానీ సవ్యంగా వేతనాలు, ప్రోత్సాహకాలు అందుకోని పరిస్థితి ఇప్పటివరకు ఉంది. వీటన్నింటికీ చెక్ పెట్టేలా ప్రస్తుత ప్రభుత్వం చక్కటి ఆలోచన చేసింది.
ఈ–ఎస్‌ఆర్ ఇలా పూరించాలి
ఈ–ఎస్‌ఆర్ పొందేందుకు ప్రతి ఉద్యోగి/అధికారి తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో పూర్తి స్థాయి వివరాలు పొందుపరచాలి. ఆయా శాఖల ఉన్నతాధికారుల సూచనల మేరకు వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తరువాత మొదటిగా సీఎఫ్‌ఎంఎస్ ఐడీ నంబర్ (ఎనిమిది అంకెలు) నమోదు చేయాలి. ఆ తరువాత వాడుకలో ఉన్న మొబైల్ నంబర్‌ను నమోదుచేస్తే, దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేసిన తరువాత ఒక్కో పార్టులో అడిగిన సమాచారం పూరించాలి. ఇలా ప్రతి ఉద్యోగి/ అధికారి తమ వివరాలు 12 పార్టుల్లో ఆయా శాఖల ఉన్నతాధికారులు అడిగిన సమాచారాన్ని నమోదు చేసి ధ్రువీకరించాలి. అక్కడి నుంచి డీడీఓల లాగిన్ చేరుతుంది. డీడీఓల ధ్రువీకరణ తరువాత ప్రభుత్వానికి వివరాలు చేరుతాయి. చదవండి: బాబు పీఏ కోసం నిబంధనలు తుంగలో తొక్కి..!
ఇవి సిద్ధంగా ఉంచుకోవాలి
1.ఎస్‌ఆర్‌లో ఇప్పటికే నమోదుచేసి ఉన్న పదో తరగతి/ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్ 2. ఇటీవల దిగిన పాస్‌ఫొటో 3. ఉద్యోగంలో చేరిన నాటి ఫొటో 4. లోకల్ స్టేటస్‌ను ధ్రువీకరించే పత్రం 5. విద్యార్హతలకు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలు 6. పాన్‌కార్డు 7. బ్యాంకు అకౌంట్ మొదటి పేజీ 8. పీఎఫ్ స్లిప్/పీఆర్‌ఏఎన్ కార్డు 9. ఏపీజీ ఎల్‌ఐసీ బాండు 10. దివ్యాంగులైతే మెడికల్ సరి్టఫికెట్ 11. కుల ధ్రువీకరణ పత్రం.
12 పార్టులుగా వివరాలు
1. వ్యక్తిగత సమాచారం 2. సర్టిఫికెట్స్ 3. సర్వీసు డీటైల్స్ 4. వేతనం వివరాలు 5. సెలవుల సమాచారం 6. లీవ్ ట్రావెల్స్ కన్సెక్షన్ సమాచారం 7. ఇంట్రస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డీటైల్స్ 8. గ్రూప్ ఇన్సూ్యరెన్స్ డీటైల్స్ 9. సర్వీసు వెరిఫికేషన్ డీటైల్స్ 10 డిపార్ట్‌మెంట్ పరీక్షలు, శిక్షణలు 11. ఇన్‌సెంటివ్, పనిష్మెంట్స్ 12. ఫెన్షన్ ప్రపోజల్స్
ప్రభుత్వ నిర్ణయం మంచిదే
ప్రభుత్వ నిర్ణయం మంచిదే. వేతనాలు, బెనిఫిట్స్ కోసం సర్వీసు రిజిస్టర్లు పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరిగే పని ఉండదు. సమయానికి అన్ని రకాల బెనిఫిట్స్ అందుతాయి. అయితే దీనిపై ఉద్యోగుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. శాఖల వారీగా ఉద్యోగులకు అవగాహన కల్పించాలి.
–చేబ్రోలు శరత్‌చంద్ర, బీటీఏ రాష్ట్ర అధ్యక్షులు
ఉద్యోగులకు ఎంతో మేలు
ఈ–ఎస్‌ఆర్ అమలు వల్ల ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. సర్వీసు ప్రయోజనాలు పొందేందుకు హెచ్‌ఎం, ఎంఈఓల చుట్టూ ఉపాధ్యాయులు తిరగాల్సి వస్తుంది. ఈ–ఎస్‌ఆర్ వల్ల ఎప్పుడు, ఏ బెనిఫిట్స్ రావాలో ఆటోమేటిక్‌గా జనరేట్ అయి, ఉద్యోగుల ఖాతాల్లోకి చేరుతుంది. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది.
–ఎంవీ మహంకాళిరావు, వైఎస్సార్ టీఎఫ్, జిల్లా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment