మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: ‘గతం గతః ఇక నుంచైనా ప్రతి మూడు నెలలకు ఒక సారి తప్పని సరిగా సమావేశమై ప్రభుత్వ పథకాల అమలు తీరు తెన్నులను సమీక్షించి వాటి ఫలాలు ప్రజల చెంతకు చేరుతున్నాయో లేదో చర్చించుకునేందుకు జిల్లా సమీక్ష సమావేశం నిర్వహిద్దాం...’ఇది ఏడాది మార్చి 2వ తేదీన నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ)లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి డీకే అరుణతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చర్చించి తీర్మానించారు.
అయితే ఆ తర్వాత సమావేశం నిర్వహించేందుకు వారికి తీరిక లేకుండా పోయింది. ఈ కారణంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు సరిగా అందక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు వచ్చాయని రైతులు సంతోషపడుతున్నా ఎరువులు దొరకడం లేదు. యూరియా కొరత లేదని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా రైతన్నలు మాత్రం ప్రతిరోజూ జిల్లాలో ఎక్కడో ఒకచోట రోడ్డెక్కి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
ఇక పంట రుణాల విషయానికొస్తే ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ. 2400 కోట్లు ఇవ్వాలని నిర్ణయించగా, ఇప్పటివరకు రూ.1200 కోట్లు మాత్రమే ఇచ్చారు. రుణం పొందేందుకు కేవలం మూడు రోజులే గడువుంది. ఈ మూడు రోజుల్లో మిగిలిన రూ.1200 కోట్లు రుణాలు ఇవ్వడం అసాధ్యం. ఇలాంటి వాటి పురోగతి గురించి ఎప్పటికప్పుడు జిల్లా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తే ఫలితాలుంటాయి. ప్రజా ప్రతినిధులే పట్టించుకోకపోవడంతో తమకెందులే అనే రీతిలో అధికారులు ఉంటున్నారు.
పెండింగ్‌లో రూ. 13 కోట్ల ‘ఉపాధి’ బిల్లులు
వలసలు నివారించేందుకు ఉపాధి హామీ పథకంతో పనులు కల్పించినా... పని చేసిన కూలీలకు మూడు నెలలుగా ప్రభుత్వం కూలి డబ్బులు నిలిపివేయడంతో దాదాపు రూ.13 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో చాలా కుటుంబాలు పూట గడవక కూలి డబ్బుల కోసం దీనావస్థలో ఎదురుచూస్తున్నా వారి తరుఫున మాట్లాడేందుకు ప్రజాప్రతినిధులకు తీరక దొరకడం లేదు. మరోవైపు జిల్లాలో గతంలో మంజూరైన ఉపాధి పనులు వివిధ కారణాలతో పూర్తికాని దాదాపు రూ.1.5 లక్షల పనులను రద్దు చేసేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. ఈ పనులను రద్దు చేస్తే అభివృద్ధి పనులు అర్థాంతరంగా ఆగిపోతాయి.
గత ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోవడంతో జిల్లాలోని 64 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని గత డీఆర్‌సీ సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా మంత్రి డీకే అరుణ చెప్పినా... ప్రభుత్వం గతంలో ప్రకటించిన కరువు మండలాలు మినహా ఒక్క మండలాన్ని కూడా జాబితాలో చేర్చలేదు.
ప్రతి ఏడాది వేసవిలో ఏర్పడుతున్న తాగునీటి ఎద్దడి శాశ్వత పరిష్కారం కోసం రూ. 600 కోట్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయాన్ని గతేడాది ఫిబ్రవరి 11, ఈ ఏడాది మార్చి 2న నిర్వహించిన డీఆర్సీ సమావేశాల్లో చర్చించి వదిలేయడంతో ఆ నిధులు ఇప్పటికీ రాలేదు. ఇన్‌చార్జిమంత్రిగా నియమితులైనప్పటి నుంచి ఉత్తమ్ కుమార్‌రెడ్డి జిల్లాలో పర్యటించిన సంద ర్భాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఇప్పటికైనా నాయకులు జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు సమావేశమై చర్చిం చాల్సిన అవసరం ఉంది.
పుర్సత్ లేదు
Published Sat, Sep 28 2013 2:55 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement