ఎంసెట్‌ ఫలితాలపై తర్జనభర్జన! | EAMCET convenor letter to AP And Telangana Intermediate board | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ ఫలితాలపై తర్జనభర్జన!

Published Sun, Apr 28 2019 4:05 AM | Last Updated on Sun, Apr 28 2019 4:05 AM

EAMCET convenor letter to AP And Telangana Intermediate board - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎంసెట్‌–2019 ఫలితాల విడుదల తేదీపై సందిగ్థత నెలకొంది. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం ఎంసెట్‌ను అధికారులు పూర్తిచేసినా ఫలితాల విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. ర్యాంకులతో ఫలితాల ప్రకటనకు అవసరమైన ఇంటర్మీడియెట్‌ మార్కులు అందకపోవడమే దీనికి కారణం. అటు ఏపీ, ఇటు తెలంగాణ బోర్డుల నుంచి ఇంటర్‌ మార్కుల సమాచారం రావాల్సి ఉండడంతో సకాలంలో ఎంసెట్‌ ఫలితాలు ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు. ఏపీ ఇంటర్మీడియెట్‌ బోర్డు గ్రేడుల రూపంలో ప్రకటించిన ఫలితాలను మార్కుల రూపంలో ఎంసెట్‌ కమిటీకి అప్పగించాల్సి ఉంది. మరోపక్క తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ఫలితాలు గందరగోళంలో పడ్డాయి. మార్కులతో సంబంధం ఉన్న ర్యాంకులను ముందుగా ప్రకటించకుండా ఎంసెట్‌లో ఆయా విద్యార్థులు సాధించిన మార్కులను ముందు ప్రకటించే అంశంపై అధికారులు ఆలోచన సాగిస్తున్నారు. ఇంటర్మీడియెట్‌ మార్కులు వచ్చాక పూర్తి స్థాయిలో ర్యాంకులను ప్రకటిస్తారు. దీనిపై సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు.

సకాలంలో పరీక్షలు పూర్తిచేసినా..
ఏపీ ఎంసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలను ఈనెల 20 నుంచి 24 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్‌లో 1,85,711 మంది, అగ్రి, మెడికల్‌లో 81,916 మంది పరీక్షలు రాశారు. వీటికి సంబంధించి సెషన్ల వారీ మాస్టర్‌ ప్రశ్నపత్రాలు, ప్రాథమిక ‘కీ’లను కూడా ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సాయిబాబు వెబ్‌సైట్‌ ద్వారా ప్రకటించారు. ఈ ప్రాథమిక ‘కీ’లపై అభ్యంతరాల స్వీకరణ శనివారంతో ముగిసింది. వీటిని నిపుణుల కమిటీతో పరిశీలన చేయించి, తుది ఫలితాలను ర్యాంకులతోపాటు ప్రకటించాల్సి ఉంది. 

ఈసారి అనుకోని అవాంతరాలు
ఈసారి ఎంసెట్‌ ఫలితాల ప్రకటనకు అనుకోని అవాంతరాలు తప్పడం లేదు. పరీక్షలను నిర్ణీత తేదీల్లో ముగించిన అధికారులు ఫలితాలను గతంలో కంటే ముందుగా మే 1నే ప్రకటించాలని భావించారు. అయితే, ఎంసెట్‌ ర్యాంకులను వెల్లడించాలంటే ఆ విద్యార్థులకు ఎంసెట్‌లో వచ్చిన మార్కులను 75 శాతంగా, ఇంటర్‌లో వచ్చిన మార్కులను 25 శాతంగా తీసుకొని ప్రకటించాల్సి ఉంటుంది. ఈ మార్కుల కోసం ఏపీ, తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డులకు ఎంసెట్‌ కన్వీనర్‌ సాయిబాబు ఇప్పటికే లేఖలు కూడా రాశారు. అయితే, ఏపీ ఇంటర్‌ ఫలితాలను ఈసారి మార్కుల విధానంలో కాకుండా గ్రేడింగ్‌ విధానంలో విడుదల చేశారు. ఈ ఫలితాలను మార్కుల రూపంలో ఎంసెట్‌ కమిటీకి ఇంటర్మీడియెట్‌ బోర్డు అందించాల్సి ఉంది. దీనికి ఇంటర్మీడియెట్‌ బోర్డు ఏర్పాట్లు చేపట్టింది. మరోపక్క తెలంగాణ ఇంటర్మీడియెట్‌ ఫలితాల ప్రకటన తీవ్ర గందరగోళంలో పడిన సంగతి తెలిసిందే.

తెలంగాణ నుంచి ఆలస్యమయ్యే అవకాశం
ర్యాంకులు ప్రకటించాలంటే తప్పనిసరిగా ఇంటర్మీడియెట్‌ మార్కులు రావాలి. ఏపీ ఇంటర్‌ మార్కులు త్వరగా వచ్చే అవకాశాలున్నా తెలంగాణ బోర్డు నుంచి చాలా ఆలస్యమయ్యేలా ఉంది. ఆ మార్కులతో సంబంధం లేకుండా ఏపీ మార్కులు వచ్చిన వెంటనే ఫలితాలు విడుదల చేయొచ్చు. కానీ తెలంగాణ నుంచి ఏపీ ఎంసెట్‌కు దాదాపుగా 18 వేల మంది వరకు హాజరయ్యారు. వారిలో ఎక్కువ మంది ఏపీకి చెందినవారే. టాప్‌టెన్‌ ర్యాంకుల్లో కూడా సగానికిపైగా వారికే వస్తుంటాయి. ఈ నేపథ్యంలో వారిని విస్మరించి ర్యాంకులు ప్రకటించడం సరికాదనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. అందుకే ర్యాంకులను ప్రకటించకుండా కేవలం ఆయా అభ్యర్థులు ఎంసెట్‌లో సాధించిన మార్కులను ముందుగా మే 1న ప్రకటిస్తే ఎలా ఉంటుందనే అంశంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల ఇంటర్మీడియెట్‌ మార్కులు వచ్చాక పూర్తి స్థాయిలో ర్యాంకులతో కూడిన ఫలితాలను ప్రకటించాలని భావిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement