
పోలింగ్ ప్రశాంతం
►ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు
►ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 91.97 శాతం పోలింగ్
►పట్టభద్రుల ఎమ్మెల్సీకి 71.43 శాతం నమోదు
►పీడీఎఫ్, టీడీపీ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ
►ఓటుకు నోటు ఎరజూపిన అధికార పార్టీ
►మధ్యాహ్నం తర్వాత జోరుగా డబ్బు పంపిణీ
►గిద్దలూరులో ఓటుకు రూ.300
►పలుచోట్ల రూ.500 నుంచి రూ.1000 వరకు..
►చీరాలలో ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు అంటూ ప్రచారం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా పెరిగింది. మొత్తంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 91.97 శాతం పోలింగ్ నమోదు కాగా, పట్టభద్రుల ఎమ్మెల్సీకి 71.43 శాతం పోలింగ్ నమోదైంది. 77,124 పట్టభద్రుల ఓటర్లకుగాను 55,090 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, 5,557 ఉపాధ్యాయ ఓటర్లకుగాను 5,111 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కందుకూరులో అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, సీపీఎం నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దివి శివరాం పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేయడంతో సీపీఎం నేతలు అడ్డుకున్నారు. ఈ ఘటన తప్ప మిగిలిన చోట్ల ఘర్షణలేవీ చోటు చేసుకోలేదు. మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.
ఓటర్లను ప్రలోభపెట్టిన అధికార పార్టీ..: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఓటర్లు ఆశించిన స్థాయిలో పోలింగ్ బూత్‌లకు రాకపోవడంతో అధికార పార్టీ ప్రలో భాల పర్వానికి తెరలేపింది. మధ్యాహ్నం నుంచి గ్రాడ్యుయేట్ ఓటర్లతో పాటు అధ్యాపక ఓటర్లకు సైతం డబ్బులు పంపిణీ చేశారు. గిద్దలూరులో అధికార పార్టీ నేతలు ఓటుకు రూ.300 చొప్పున పంపిణీ చేశారు. దర్శి, కందుకూరు, అద్దంకి, చీరాల, గిద్దలూరు, సంతనూతలపాడు, కొండపి తదితర ప్రాంతాల్లో రూ.500 నుంచి రూ.1,000 వరకు పంపిణీ చేశారు. చీరాలలో అధికార పార్టీ నేతలు ఓటర్లకు ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు ఇస్తామంటూ తొలుత ప్రచారం చేశారు. ఉదయం పూట ఇవేమీ ఇవ్వకపోవడంతో ఓటర్లు పోలింగ్ బూత్‌లకు రాలేదు. దీంతో పోలింగ్ ఓటర్లు లేక బూత్‌లు వెలవెలబోయాయి. పరిస్థితి గమనించిన అధికార పార్టీ నాయకులు ఓటర్లను వాహనాలు పెట్టి వారి ఇళ్ల వద్ద నుంచి పోలింగ్ బూత్‌లకు తరలించారు. రూ.500 నుంచి రూ.1,000 వరకు డబ్బులు పంపిణీ చేశారు.
అధికార పార్టీ నేతలు నియోజకవర్గ కేంద్రాలతో పాటు ప్రధానంగా పోలింగ్ కేంద్రాల పరిధిలో మకాం వేసి డబ్బు పంపిణీ వ్యవహారాన్ని పర్యవేక్షించారు. దీంతో మధ్యాహ్నం నుంచి ఓటింగ్ శాతం పెరిగింది. చివరి రెండు గంటల్లో దర్శి, అద్దంకి, చీమకుర్తి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదైంది. దర్శిలో చివరి రెండు గంటల్లో 836 ఓట్లు నమోదు కావడం గమనార్హం. కొన్ని చోట్ల ఓటర్లకు సకాలంలో డబ్బులందకపోవడంతో చాలా మంది ఓటర్లు ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. అధికార పార్టీ పెద్ద ఎత్తున పంపిణీ చేస్తుందని ముందస్తు ప్రచారం చివరి నిమిషంలో చాలా మందికి డబ్బులు చేరలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోటీ పీడీఎఫ్, టీడీపీ అభ్యర్థుల మధ్య ప్రధానంగా ఉన్నా... ఓటర్లు పెద్ద సంఖ్యలో పీడీఎఫ్ అభ్యర్థులకు ఓటేసేందుకు మొగ్గుచూపినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికారులు, పోలీసులు కృషి చేశారు. నిబంధనల మేరకు పోలింగ్ బూత్‌ల్లోకి ఓటర్లు మినహా ప్రజాప్రతినిధులు, మీడియాను సైతం అనుమతించలేదు.