విద్యుత్ శాఖకు ‘ఎన్‌రిచ్’ షాక్
- సోలార్ పార్కు పేరిట మాయాజాలం
- రూ.6 కోట్ల బ్యాంకు గ్యారంటీల ఎగవేత
సాక్షి, హైదరాబాద్: వినియోగదారులకు షాక్‌లివ్వడం.. గుండె గు‘బిల్లు’మనిపించడమే విద్యుత్ శాఖకు ఇప్పటి వరకు తెలుసు. కాని తాజాగా కరెంటోళ్లకు షాక్ ఇచ్చిందో కంపెనీ. పెట్టుబడి లేకుండా మాయమాటలతో టోకరా వేసింది. అధికారులను బురిడీ కొట్టించింది. సోలార్ విద్యుత్తు సరఫరాకు ఒప్పందం చేసుకొని దాదాపు రూ. 6 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఎగవేసింది ఎన్‌రిచ్ అనే ప్రైవేట్ కంపెనీ. ప్రస్తుతం విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగంలో ఇది చర్చనీయాంశంగా మారింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 ఆగస్టులో సోలార్ విద్యుత్తు కొనుగోలుకు ఏపీ ట్రాన్స్‌కో ఓపెన్ ఆఫర్ టెండర్ ప్రకటించింది. యూనిట్‌కు రూ.6.49 చొప్పున 20 ఏళ్లపాటు విద్యుత్తు సరఫరా చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలను ఆహ్వానించింది. ఎన్‌రిచ్ ఎనర్జీ అనే కంపెనీ మెదక్ జిల్లా జహీరాబాద్ సమీపంలోని 132 కేవీ సబ్‌స్టేషన్ సమీపంలో సోలార్ పార్క్ నుంచి 40 మెగావాట్ల విద్యుత్తు సరఫరా చేసేందుకు దరఖాస్తు చేసుకుంది. నిబంధనల ప్రకారం ఒక్కో మెగావాట్‌కు రూ.2 లక్షల చొప్పున రూ.80 లక్షల నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించింది.
2014 ఫిబ్రవరి 22న ఆంధ్రప్రదేశ్ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ(ఏపీపీసీసీ) ఈ కంపెనీకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ) జారీ చేసింది. సాధారణంగా నెలరోజుల వ్యవధిలో కంపెనీ డిస్కంతో ఒప్పందం చేసుకోవాలి. ఒప్పంద సమయంలో ఒక్కో మెగావాట్‌కు రూ.10 లక్షల చొప్పున ఆ కంపెనీ డిస్కంలకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలి. ఒప్పందం చేసుకున్నాక ఏడాది వ్యవధిలో విద్యుత్తు సరఫరా చేయాలి. గడువు దాటితే జరిమానా కింద గ్యారంటీ డబ్బును డిస్కంలు జస్తు చేసుకునేలా నిబంధనలున్నాయి.
కానీ 2015 మార్చి 31వ తేదీలోగా పీపీఏ చేసుకోవాలని, పీపీఏ చేసుకున్నాక ఏడాది వ్యవధిలో విద్యుత్తు సరఫరా చేయాలని ఈ కంపెనీకి ట్రాన్స్‌కో వెసులుబాటు ఇచ్చింది. ఈలోగా 40 మెగావాట్లకు బదులు 60 మెగావాట్ల సరఫరాకు అనుమతించాలని ఈ కంపెనీ ఓ లేఖ రాసింది. దానికి సైతం ఏపీపీసీసీ అధికారులు అంగీకరించారు. రాష్ట్ర విభజనకు ముందే మే నెలలో దానికి అనుమతి లభించింది. దీంతో మెగావాట్‌కు రూ.2 లక్షల చొప్పున రూ.40 లక్షల ప్రాసెసింగ్ ఫీజును ఆ కంపెనీ చాకచక్యంగా ఎగవేసినట్లు తెలుస్తోంది.
పార్కు తరహాలో అనుమతి ఇవ్వటంతో ఈ కంపెనీ పెట్టుబడి లేకుండా దళారీ వ్యాపారానికి ద్వారాలు తెరిచింది. ప్లాంట్లు నెలకొల్పే కంపెనీలను ఎన్‌రిచ్ సంస్థ సోలార్ పార్కుకు ఆహ్వానించి ఆదాయం రాబట్టుకుంటోంది. మరోవైపు డిస్కంకు ఆ కంపెనీలతోనే ఒప్పందం చేయించి తాను బ్యాంకు గ్యారంటీలను చెల్లించకుండా తప్పించుకుంది. ఇప్పటివరకు ఎన్‌రిచ్ ఎనర్జీ పార్కు నుంచి 22 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు కంపెనీలు ముందుకొచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
అంతమేరకు బ్యాంకు గ్యారంటీలు వచ్చే అవకాశముంది. కానీ ఎన్‌రిచ్ కంపెనీ మిగతా 38 మెగావాట్లు సరఫరా చేయకున్నా డిస్కంలు కళ్లప్పగించి చూస్తున్నాయి. ఆ కంపెనీకి చెందిన గ్యారంటీలు తమ చేతిలో లేకపోవటంతో అంత మొత్తం ఆదాయం నష్టపోనుంది. అంతకు మించి ప్రోత్సాహకాలు చెల్లించే నిబంధన డిస్కంలకు తలనొప్పిగా మారనుంది.