
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, పశ్చిమగోదావరి: కలప రవాణాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ కోన రామకృష్ణ, చింతలపూడి ఏరియా డిప్యూటీ ప్లాంటేషన్ మేనేజర్ కృష్ణవేణిపై సస్పెన్షన్ వేటు పడింది. వీరిపై విచారణకు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గురువారం ఆదేశించారు. ఈమేరకు అధికారులకు ఉత్తర్వులు అందాయి.
వివరాల్లోకి వెళితే.. గత నెల 20న చింతలపూడి తాలూకా ఎర్రగుంటపల్లిలో కలపను అక్రమంగా రవాణా చేస్తున్న లారీను గ్రామస్తులు పట్టుకున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ... ఈ ఘటనపై డివిజినల్ మేనేజర్ కె.రామలింగారెడ్డిని విచారణ అధికారిగా (విజిలెన్స్) నియమించింది. పైస్థాయి అధికారులు జరిపిన దర్యాప్తులో ప్రభుత్వం ప్రతిపాదించిన కలప కొలతలు కాకుండా.. ఇతర సైజుల్లో కలప అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా తేటతెల్లమైంది. దీంతో ఎప్పటినుంచో అధికారులు కుమ్మక్కై జరుపుతున్న ఈ అవినీతి బాగోతానికి ఫుల్‌స్టాప్ పడింది.