ఏలూరే రాజధాని కావాలి
* ‘పశ్చిమ’లో పెరుగుతున్న డిమాండ్
సాక్షి, ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడ - గుంటూరు మధ్య మంగళగిరి లేదా అమరావతిలో రాజధాని.. కాకినాడ తీర ప్రాంతంలో పెట్రో కెమికల్స్ కారిడార్.. విశాఖకు రైల్వే జోన్.. మరి వీటి మధ్యన అన్ని సహజ, శక్తి వనరులు ఉన్న పశ్చిమగోదావరి జిల్లాకు ఏంటి..? అధికార పక్షానికి 15 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన జిల్లాకు ఇప్పటివరకు ప్రత్యేకంగా ఏమీ కేటాయించలేదు! ఇది ‘పశ్చిమ’ ప్రజల నుంచి పెల్లుబుకుతున్న అసంతప్తి. తమ జిల్లాకు ఒక్క ప్రాజెక్టూ వచ్చేలా కనిపించడం లేదంటూ రగిలిపోతున్న జిల్లావాసులు ఇప్పుడు ఏకంగా ఏలూరు(హేలాపురి)నే రాజధాని చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాకు చెందిన వ్యాపార, వాణిజ్య వర్గాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు, విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలు, మేధావులు ఏలూరును ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని గళం విప్పుతున్నారు. భారతదేశ ధాన్యాగారంగా, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా, దేశంలోనే సేంద్రియ వ్యవసాయ పథకం అమలు చేస్తున్న ఏకైక జిల్లాగా, రాష్ట్రంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లాగా ప్రత్యేకతలున్న పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరును రాజధానిగా చేయాలని కోరుతున్నారు. రాజధానికి కావాల్సిన అన్ని సదుపాయాలు, సౌకర్యాలు, సహజ, శక్తివనరులు ఉన్నాయని వాదిస్తున్నారు. ఏలూరు - హనుమాన్‌జంక్షన్ ప్రాంతం రాష్ట్ర రాజధానికి అన్ని విధాలుగా అనువైనదని వివరిస్తున్నారు.
ఇక్కడలక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడంతో పాటు రెండు లక్షల ఎకరాల అటవీ భూమి ఉంది. నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను ఇందులోంచి తీసుకోవచ్చు. కృష్ణా - గోదావరి నదుల మధ్య ఉన్న ప్రాంతం కావడంతో నీటి లభ్యత ఎక్కువగా ఉంది. తాగునీటికి ఇబ్బంది ఉండదు. మచిలీపట్నం, కాకినాడ పోర్టుల మధ్య ప్రాంతం కావడం వల్ల పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు, అభివద్ధికి, జల రవాణాకు అనుకూలం.
గన్నవరం, రాజమండ్రి ఎయిర్‌పోర్టుల మధ్య ఉండడం.. 16న నంబరు జాతీయ రహదారి పాస్ అవుతుండడం, దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు అతి సమీపంలో ఉండడంతో పాటు బ్రాడ్‌గేజ్ రైలు మార్గం ఉండడం వల్ల ఈ ప్రాంతం రవాణా వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉంది. ఈ ప్రాంతంలో సహజవాయువు నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు వల్ల అదనంగా విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కానుంది. అన్నింటికీ మించి భౌగోళికంగా ఏలూరు - హనుమాన్‌జంక్షన్ సీమాంధ్రకు నడిబొడ్డున ఉంది. రాజధాని ఏర్పాటైతే ఈ ప్రాంతంలో అనూహ్యమైన అభివృద్ధి జరుగుతుంది.