helapuri
-
చరిత్రకు ఆనవాళ్లుగా పురాతన కట్టడాలు
ఏలూరు (టూటౌన్): వేంగి రాజుల పాలనలో హేలాపురిగా పిలువబడిన ఏలూరులో పలు చారిత్రాత్మక కట్టడాలు నేటికీ ఆ సామ్రాజ్య ప్రాభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అప్పట్లో ఈ నగరంలో రత్నాలు రాశులు పోసి అమ్మేవారని ప్రతీతి. చుట్టూ ఏరులతో ఏరుల ఊరుగా కూడా ఈ నగరాన్ని గతంలో పిలిచేవారు. ఈ ప్రాంతంలో రాజుల కాలం నుంచి బ్రిటీష్ హయాం వరకూ, జమిందారీల కాలం వరకూ ఎన్నో అపురూప కట్టడాలు హేలాపురిలో వెలిశాయి. నాటి చరిత్రకు ఆనవాళ్లుగా ఈ కట్టడాలు నేటికీ చెక్కుచెదకుండా నిలిచి వీక్షకులను అబ్బురపరుస్తున్నాయి. వీటిలో ఎంతో విశిష్టత ఉన్న కట్టడాలతో పాటు దేవాలయాలు ఉండటం విశేషం. వేంగీ రాజుల కాలంలో 1104 సంవత్సరంలో నిర్మించిన పడమర వీధిలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం, శనివారపుపేటలోని చెన్నకేశవస్వామి దేవాలయ గోపురం, దొంగల మండపం, కోటదిబ్బలో ఉన్న శాసనాలు నేటికీ చెక్కుచెదరలేదు. బ్రిటీష్ హయాంలో నిర్మించిన జిల్లా కలెక్టరేట్ భవనం, నాటి ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు నిర్మించిన సరీ్వసు రిజర్వాయరు, మున్సిపల్ పాత కార్యాలయం, జిల్లా విద్యాశాఖ పాత కార్యాలయాలు నాటి చరిత్రకు గుర్తులుగా మిగిలాయి. వీటితో పాటు నాటి హేలాపురిలో ఉండే జమిందారీ మహల్స్, ఇతర భవనాలు దర్శనమిస్తున్నాయి. ఈ కట్టడాలను చూసినప్పుడు నేటి తరం ప్రజలు హేలాపురికి ఇంతటి ఘనచరిత్ర ఉందా అంటూ చర్చించుకోవడం పరిపాటిగా మారింది. ఏది ఏమైనప్పటికీ అలనాటి చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్న ఈ కట్టడాలను సంరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. బ్రిటీష్ కాలం నాటి మున్సిపల్ కార్యాలయం - అప్పటి జమిందారీ మహల్ - బ్రిటీష్ కాలం నాటి పాత డీఈఓ కార్యాలయం - దొంగల మండపం -
భళా.. వేంగి కళ
చారిత్రక నగరం హేలాపురిలో వేంగి కళా ఉత్సవాలు శుక్రవారం మొదలయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల శాస్త్రీయ, జానపద నృత్య కళారీతులను ప్రదర్శిస్తున్నారు. గుంటూరుకు చెందిన ప్రవల్లిక కూచిపూడి నృత్య విన్యాసమిది. గజ్జె ఘల్లున.. గుండె ఝల్లున ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : నగరానికి చెందిన శ్రీ లలితా కామేశ్వరి నృత్య సదనం ఆధ్వర్యంలో నాట్యాచారిణి ఘండికోట అలివేలు ఉష నిర్వహణలో శుక్రవారం ప్రారంభమైన వేంగి కళా ఉత్సవాలు అలరించాయి. అంతర్జాతీయ స్థాయి నృత్య కళాకారుల నృత్యప్రదర్శన కళాకారులను రంజింపజేశాయి. నవీ ముంబైకి చెందిన అపేక్ష ముందర్జీ భరతనాట్యం, గుంటూరుకు చెందిన ప్రవల్లిక కూచిపూడి నృత్యం నగరవాసులను విపరీతంగా అలరించాయి. అలాగే చెన్నైకి చెందిన అమర్నాథ్ ఘోష్ కథక్ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -
హేలాపురి.. రూపు మారేనా మరి
- రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలోకి ఏలూరును చేర్చాలని నిర్ణయం - అనూహ్య ప్రగతికి అవకాశం సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పరిధిని ఏలూరు వరకు విస్తరించాలన్న రాష్ర్ట ప్రభుత్వ తాజా నిర్ణయం హేలాపురి ప్రగతిపై కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సహజ శక్తి వనరులు పుష్కలంగా ఉన్నా.. ఇప్పటికీ ఏలూరు నగరం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంది. సీఆర్డీఏ పరిధిలోకి వస్తే నగర రూపురేఖలు పూర్తిగా మారే అవకాశం ఉంది. ఇప్పటివరకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 58 మండలాలు మాత్రమే సీఆర్డీఏ (కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలో ఉన్నాయి. కృష్ణాజిల్లాలో ఉత్తరం వైపున హనుమాన్ జంక్షన్ వరకు ఉన్న పరిధిని పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు వరకు విస్తరించాలని సీఆర్డీఏ భావిస్తోంది. గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఫలితాలే టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు కీలకం అయ్యాయి. అప్పటినుంచి ఈ జిల్లా రుణం తీర్చుకుంటానంటూ పదేపదే ప్రకటిస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు ఇప్పటివరకైతే పశ్చిమ సమగ్రాభివృద్ధికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ ప్రకటిం చలేదు. ఈ నేపథ్యంలో ఏలూరును సీఆర్డీఏ పరిధిలోకి తీసుకు రావడం ద్వారా జిల్లాకు మేలు చేశామని అనిపించుకునేందుకు సీఎం ఈ యోచనను తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పరిధి ఎక్కువైందని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నా ఏలూరు వరకు చేర్చాలని బాబు పట్టుబడుతున్నట్టు తెలిసింది. ఏలూరు నగరాన్ని చేరిస్తే సీఆర్డీఏ పరిధి విజయవాడ నుంచి 60 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. గుంటూరు నుంచి విజయవాడకు పశ్చిమంగా 180 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వేస్తున్నందున ఈ పరిధి మొత్తం సీఆర్డీఏలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏలూరులో రాజధాని విభాగం సీఆర్డీఏ పరిధిలోకి ఏలూరు చేరితే పాలనాపరంగా పూర్తి మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. రాజధాని అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగం ఇక్కడ ఏర్పాటవుతుంది. రెవెన్యూ విభాగానికి సంబంధం లేకుండానే స్పెషల్ డెప్యూటీ కలెక్టర్, ఆర్డీవోలతో ఏర్పాటయ్యే ప్రత్యేక రాజధాని విభాగం పనిచేస్తుంది. రాజధానికి సంబంధించిన అన్ని పరిపాలనాంశాలు ఏలూరులోనే అందుబాటులో ఉంటాయి. ఏలూరు నగర పరిధి విస్తరిస్తుంది. కేంద్ర, రాష్ట్రాల నుంచి వచ్చే నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు పెరుగుతాయి. నూతన పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సులభమవుతుంది. ఉపాధి అవకాశాలు పూర్తిస్థాయిలో విస్తరిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపు పెరుగుతుంది. మొత్తంగా ఏలూరు రూపురేఖలు మారిపోతాయంటే అనుమానమే లేదు. -
ఏలూరే రాజధాని కావాలి
* ‘పశ్చిమ’లో పెరుగుతున్న డిమాండ్ సాక్షి, ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడ - గుంటూరు మధ్య మంగళగిరి లేదా అమరావతిలో రాజధాని.. కాకినాడ తీర ప్రాంతంలో పెట్రో కెమికల్స్ కారిడార్.. విశాఖకు రైల్వే జోన్.. మరి వీటి మధ్యన అన్ని సహజ, శక్తి వనరులు ఉన్న పశ్చిమగోదావరి జిల్లాకు ఏంటి..? అధికార పక్షానికి 15 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన జిల్లాకు ఇప్పటివరకు ప్రత్యేకంగా ఏమీ కేటాయించలేదు! ఇది ‘పశ్చిమ’ ప్రజల నుంచి పెల్లుబుకుతున్న అసంతప్తి. తమ జిల్లాకు ఒక్క ప్రాజెక్టూ వచ్చేలా కనిపించడం లేదంటూ రగిలిపోతున్న జిల్లావాసులు ఇప్పుడు ఏకంగా ఏలూరు(హేలాపురి)నే రాజధాని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాకు చెందిన వ్యాపార, వాణిజ్య వర్గాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు, విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలు, మేధావులు ఏలూరును ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని గళం విప్పుతున్నారు. భారతదేశ ధాన్యాగారంగా, ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా, దేశంలోనే సేంద్రియ వ్యవసాయ పథకం అమలు చేస్తున్న ఏకైక జిల్లాగా, రాష్ట్రంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లాగా ప్రత్యేకతలున్న పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరును రాజధానిగా చేయాలని కోరుతున్నారు. రాజధానికి కావాల్సిన అన్ని సదుపాయాలు, సౌకర్యాలు, సహజ, శక్తివనరులు ఉన్నాయని వాదిస్తున్నారు. ఏలూరు - హనుమాన్‌జంక్షన్ ప్రాంతం రాష్ట్ర రాజధానికి అన్ని విధాలుగా అనువైనదని వివరిస్తున్నారు. ఇక్కడలక్ష ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడంతో పాటు రెండు లక్షల ఎకరాల అటవీ భూమి ఉంది. నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములను ఇందులోంచి తీసుకోవచ్చు. కృష్ణా - గోదావరి నదుల మధ్య ఉన్న ప్రాంతం కావడంతో నీటి లభ్యత ఎక్కువగా ఉంది. తాగునీటికి ఇబ్బంది ఉండదు. మచిలీపట్నం, కాకినాడ పోర్టుల మధ్య ప్రాంతం కావడం వల్ల పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు, అభివద్ధికి, జల రవాణాకు అనుకూలం. గన్నవరం, రాజమండ్రి ఎయిర్‌పోర్టుల మధ్య ఉండడం.. 16న నంబరు జాతీయ రహదారి పాస్ అవుతుండడం, దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు అతి సమీపంలో ఉండడంతో పాటు బ్రాడ్‌గేజ్ రైలు మార్గం ఉండడం వల్ల ఈ ప్రాంతం రవాణా వ్యవస్థకు ఆయువుపట్టుగా ఉంది. ఈ ప్రాంతంలో సహజవాయువు నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు వల్ల అదనంగా విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కానుంది. అన్నింటికీ మించి భౌగోళికంగా ఏలూరు - హనుమాన్‌జంక్షన్ సీమాంధ్రకు నడిబొడ్డున ఉంది. రాజధాని ఏర్పాటైతే ఈ ప్రాంతంలో అనూహ్యమైన అభివృద్ధి జరుగుతుంది.