- రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలోకి ఏలూరును చేర్చాలని నిర్ణయం
- అనూహ్య ప్రగతికి అవకాశం
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిని ఏలూరు వరకు విస్తరించాలన్న రాష్ర్ట ప్రభుత్వ తాజా నిర్ణయం హేలాపురి ప్రగతిపై కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సహజ శక్తి వనరులు పుష్కలంగా ఉన్నా.. ఇప్పటికీ ఏలూరు నగరం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంది. సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తే నగర రూపురేఖలు పూర్తిగా మారే అవకాశం ఉంది. ఇప్పటివరకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 58 మండలాలు మాత్రమే సీఆర్‌డీఏ (కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) పరిధిలో ఉన్నాయి. కృష్ణాజిల్లాలో ఉత్తరం వైపున హనుమాన్ జంక్షన్ వరకు ఉన్న పరిధిని పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు వరకు విస్తరించాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఫలితాలే టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు కీలకం అయ్యాయి.
అప్పటినుంచి ఈ జిల్లా రుణం తీర్చుకుంటానంటూ పదేపదే ప్రకటిస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు ఇప్పటివరకైతే పశ్చిమ సమగ్రాభివృద్ధికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ ప్రకటిం చలేదు. ఈ నేపథ్యంలో ఏలూరును సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకు రావడం ద్వారా జిల్లాకు మేలు చేశామని అనిపించుకునేందుకు సీఎం ఈ యోచనను తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పరిధి ఎక్కువైందని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నా ఏలూరు వరకు చేర్చాలని బాబు పట్టుబడుతున్నట్టు తెలిసింది. ఏలూరు నగరాన్ని చేరిస్తే సీఆర్‌డీఏ పరిధి విజయవాడ నుంచి 60 కిలోమీటర్ల వరకు విస్తరిస్తుంది. గుంటూరు నుంచి విజయవాడకు పశ్చిమంగా 180 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వేస్తున్నందున ఈ పరిధి మొత్తం సీఆర్‌డీఏలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఏలూరులో రాజధాని విభాగం
సీఆర్‌డీఏ పరిధిలోకి ఏలూరు చేరితే పాలనాపరంగా పూర్తి మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. రాజధాని అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగం ఇక్కడ ఏర్పాటవుతుంది. రెవెన్యూ విభాగానికి సంబంధం లేకుండానే స్పెషల్ డెప్యూటీ కలెక్టర్, ఆర్డీవోలతో ఏర్పాటయ్యే ప్రత్యేక రాజధాని విభాగం పనిచేస్తుంది. రాజధానికి సంబంధించిన అన్ని పరిపాలనాంశాలు ఏలూరులోనే అందుబాటులో ఉంటాయి. ఏలూరు నగర పరిధి విస్తరిస్తుంది. కేంద్ర, రాష్ట్రాల నుంచి వచ్చే నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు పెరుగుతాయి. నూతన పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సులభమవుతుంది. ఉపాధి అవకాశాలు పూర్తిస్థాయిలో విస్తరిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపు పెరుగుతుంది. మొత్తంగా ఏలూరు రూపురేఖలు మారిపోతాయంటే అనుమానమే లేదు.
హేలాపురి.. రూపు మారేనా మరి
Published Fri, Jul 24 2015 1:32 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement