యువర్ అటెన్షన్ ప్లీజ్
Published Thu, Feb 6 2014 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
రైల్వే స్టేషన్లలో సౌకర్యాల కల్పన జీవిత కాలం లేటు రైళ్ల హాల్టుల కోసం ప్రయాణికుల నిరీక్షణ
రైల్వే స్టేషన్లలో సదుపాయాల కల్పన.. కొత్త రైళ్ల మంజూరు.. పాత రైళ్లకు కొత్త హాల్టులు ఇవ్వడంలోనూ తాము జీవితకాలం లేటేనని నిరూపిస్తున్నారు రైల్వే శాఖ ఉన్నతాధికారులు. ఏలూరు-కొవ్వూరు మధ్య మెయిన్‌లైన్ వెంబడి గల రైల్వే స్టేషన్లలో సమస్యలు కూత పెడుతున్నాయి. ప్రతి బడ్జెట్‌లోనూ జిల్లా వాసులను ఊరిస్తూ.. చివరకు నిరాశపరిచే కొవ్వూరు-భద్రాచలం, కోటిపల్లి-కోనసీమ రైల్వే లైన్ల సంగతి అటుంచితే... అనుమతులొచ్చినా.. నిధులు మంజూరైనా.. విజయవాడ-భీమవరం-నిడదవోలు బ్రాంచి లైన్ డబ్లింగ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ శ్రీవాత్సవ గురువారం జిల్లాలోని స్టేషన్లను పరిశీలించనున్న నేపథ్యంలో జిల్లాలో రైల్వే పరిస్థితులపై ఫోకస్
తాడేపల్లిగూడెం,న్యూస్‌లైన్ : జిల్లా నడిబొడ్డున ఉన్న తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌కు జిల్లా కేంద్రం ఏలూరు స్టేషన్‌తో సమానంగా ప్రయాణికుల ద్వారా ఆదాయం వస్తోంది. బియ్యం, ఎరువులు, ఉల్లిపాయల రవాణా ద్వారా ఈ స్టేషన్ నుంచి రైల్వేస్‌కు అదనపు ఆదాయం సమకూరుతోంది. స్టేషన్ ఏ గ్రేడ్‌లో ఉన్నా సౌకర్యాలు డీ గ్రేడులో ఉన్నాయి. ఇటీవల కంటితుడుపుగా నాలుగు రైళ్లకు హాల్టు కల్పించారు.ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదు.
సౌకర్యాలు మృగ్యం
స్టేషన్‌లోని ఒకటి, రెండు ఫ్లాట్ ఫారాలకు లిప్టు సౌకర్యం కల్పించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయాణికులు కోరుతున్నారు. ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన లిఫ్టు ప్రతిపాదనను చీరాల తరలించుకుపోయారు. ఒకటో ప్లాట్ ఫారం నుంచి రెండో ప్లాట్ ఫాం వరకు ఉన్న పుట్ బ్రిడ్జిని మూడోనంబరు ప్లాట్ ఫాం వరకు విస్తరించాలనేది మరో డిమాండ్. రైలు పట్టాలు దాటేందుకు చిన్న వంతెన వరకు ఉన్న కాలిబాట ఓవర్ బ్రిడ్డిని ఏలూరు రోడ్డుకు కలపాలనేది ఎప్పటి నుంచే చేస్తున్న విజ్ఞప్తి. రెండో టికెట్ కౌంటర్ ఏర్పాటు కలగా మారింది. ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న ఇరిగేషన్ స్దలం వాటర్ బ్యాంక్ కారణంగా ఇచ్చే అవకాశాలు కనిపించడంలేదు. దీంతో ఏలూరు రోడ్డులో ఉన్న చినవంతెన సమీపంలో ఏలూరులో మాదిరిగా టికెట్ కౌంటర్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ టికెట్ కౌంటర్‌ను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేసేలా చర్యలు తీసుకోవాలనేది మరో డిమాండ్. రోజూ వేలాది మంది ఈ స్టేషన్ ద్వారా ప్రయాణిస్తున్నా మంచి నీటి సౌకర్యం మాత్రం మృగ్యం. మునిసిపల్ వాటర్ సుదపాయం కల్పించాలని దశాబ్దాలుగా ఉన్న డిమాండ్‌కు కదలిక లేదు. బోరు వాటరు ఇస్తున్నా పైపు లైన్లు పాడైపోయి ఈ స్టేషన్‌లో నీరు కావాలంటే దొరకని దుస్థితి.
హాల్టులు కావాలి..
కాకినాడ నుంచి భావనగర్ మధ్య ప్రతి గురువారం నడిచే రైలు(17204)కు ఇక్కడ హాల్టు కావాలని కోరుతున్నారు. జిల్లాలోని మార్వాడి కుటుంబాలకు, గుజరాత్‌తో వ్యాపార కార్యకలాపాలు సాగించే వారికి అహ్మదాబాద్ వెళ్లటానికి ఈ రైలు ఉపకరిస్తుంది. విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్(స్వర్ణజయంతి-12803-804)కు, దిబ్రూఘర్ -కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టులు కోరుతున్నారు. శబరిమలై వెళ్లేవారికి ఉపయుక్తంగా ఉండే విశాఖపట్నం-కొల్లాం త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్(18567) కు హాల్టు కావాలంటున్నారు. ఈ రైలుకు విశాఖ నుంచి 16.30 కిలో మీటర్ల దూరంలో ఉన్న దువ్వాడ, అక్కడి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న యలమంచిలిలో హాల్టులు ఇచ్చారు కానీ, పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాన రైల్వే స్టేషన్‌గా ఉన్న ఇక్కడ మాత్రం హాల్టు కల్పించలేదు.
పేరుకే పెద్దస్టేషన్
ఏలూరు, న్యూస్‌లైన్ : పెద్ద స్టేషన్‌గా పిలువబడే ఏలూరు రైల్వేస్టేషన్‌లో సౌకర్యాల కల్పన మిథ్యగానే మారింది. రోజూ 80 రైళ్లు స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. రైళ్లలో వివిధ వస్తువుల ఎగుమతులు, ప్రయాణీకుల చార్జీల ద్వారా ఏడాదికి రూ. ఆరున్నర కోట్ల ఆదాయం వస్తోంది. స్టేషన్లో పారిశుధ్య పరిస్థితులు అధ్వానం. మంచినీరు సక్రమంగా లేక వేలాదిమంది ప్రయాణికులు వాటర్ బాటిల్స్‌పైనే ఆధారపడుతున్నారు. పెద్ద రైల్వేస్టేషన్‌లో పురుషులు, స్త్రీలకు వేరుగా టికెట్ కౌంటర్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పవర్‌పేటలో అన్నీ కరువే
నగరానికి నడిబొడ్డున ఉన్న పవర్‌పేట రైల్వేస్టేషన్‌లో వసతులు లోపించాయి. ఇక్కడ టికెట్ కౌంటర్ ఒకటే ఉండటంతో ప్రయాణీకుల తోపులాటలు సర్వసాధారణం. ప్లాట్‌ఫారంపై టాయిలెట్స్ లేక అవస్థలు పడుతున్నారు. రైల్వే భద్రతా సిబ్బంది ఇద్దరు మాత్రమే ఉన్నారు. రాత్రివేళ ప్లాట్‌ఫారమ్స్‌పై లైట్లు వెలగక ప్రయాణీకులు బిక్కుబిక్కుమంటూ అర్ధరాత్రి రాయగడ పాసింజర్ కోసం ఎదురు చూస్తూంటారు. తాగునీటి సదుపాయం కూడా లేదు.
రక్షణ కరువు
ఏలూరు పవర్‌పేట, శ్రీనివాస థియేటర్ మధ్య 8 ఏళ్ల క్రితం అండర్ పాస్ నిర్మిం చారు. అండర్‌పాస్ పైన పట్టాలు దాటుతూ పలువురు మృత్యువాత పడ్డారు. డీసీసీబీ కార్యాలయం ఎదురుగా రైల్వే రక్షణ గోడ లేకపోవటంతో పట్టాలపై నుంచి రాకపోకలు సాగిస్తూ మృత్యువాతపడుతున్నారు.
మందగించిన ఎగుమతులు
గతంలో ఏలూరు స్టేషన్ నుంచి నిమ్మకాయలు, చేపలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. ఇప్పుడు టన్ను మించి ఉంటేనే రైలు ర్యాక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కారణంగా వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఏటా రూ.కోటిన్నరపైనే ఈ స్టేషన్ నుంచి రైల్వేలు ఆదాయం కోల్పోతున్నాయని అంచనా.
ముఖ్యమైన రైళ్లకు నో హాల్ట్
జిల్లా కేంద్రమైన ఏలూరు పెద రైల్వేస్టేషన్‌లో సూపర్‌ఫాస్ట్, వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు సుమారు 20 రైళ్ల ఆగే పరిస్థితి లేదు. కోరమాండల్, గౌహతి, కరియ-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లకూ హాల్ట్ లేదు. ప్లాట్‌ఫారాల సంఖ్య పెంచకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఒక లో నంబరు ప్లాట్‌ఫారం ట్రాక్‌పై గూడ్స్‌రైళ్ళను మళ్లిస్తున్నారు. 2, 3 ప్లాట్‌ఫారాలపై ప్రయాణీకుల బళ్లు ఆగుతున్నాయి. ప్రయాణీకులు ఫుట్ పాత్ బ్రిడ్జి ఎక్కి 2, 3 ప్లాట్‌ఫారాలకు వెళ్లాల్సి వస్తోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఎస్కలేటర్లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పట్టించుకునేవారే కరువయ్యారు.
Advertisement
Advertisement