గోదావరిఖని, న్యూస్‌లైన్ : సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు హైదరాబాద్‌కు సమీపంలో అతి తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామంటూ రూ.కోట్లు దండుకునేందుకు కొందరు చేసిన ప్రయత్నాలను ఓ ఉద్యోగి వెలుగులోకి తీసుకొచ్చారు. సింగరేణి విస్తరించి ఉన్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు ప్రభుత్వ భూమిని ఇళ్ల నిర్మాణాల కోసం కేటాయిస్తామంటూ 2005 ఫిబ్రవరిలో ‘సింగరేణియన్స్ మ్యూచ్‌వల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు.
దీనికి అప్పటి ఆర్జీ-3 జీఎం (ప్రస్తుత డెరైక్టర్) బి.రమేష్‌కుమార్ గౌరవాధ్యక్షులుగా, అప్పటి అకౌంట్స్ ఆఫీసర్ ఆర్‌వీఎస్‌ఆర్‌కే.ప్రసాద్ కార్యదర్శిగా, ఆర్జీ-1లో పనిచేసిన స్పెషల్ గ్రేడ్ క్లర్క్ ఎం.వెంకటయ్య కోశాధికారిగా పేర్లు రిజిస్టర్ చేశారు. జీఎం రమేష్‌కుమార్ రెండు రోజులకే ఆ సొసైటీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు. తర్వాత ఆయన ప్రమేయం లేకుండా సొసైటీకి కార్యదర్శిగా వ్యవహరించిన ప్రసాద్ ఒక సర్క్యులర్‌ను జారీ చేసి కార్మికులు, ఉద్యోగుల ఆశలను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించాడు.
ఇందులో భాగంగా ఆర్జీ-1లో 2,401 మంది, ఆర్జీ-2లో 111 మంది, ఆర్జీ-3లో 102 మంది, శ్రీరాంపూర్‌లో 117 మంది కలిపి 2731 మంది వద్ద రూ.2,350 చొప్పున రూ.64,17,880 వసూలు చేశాడు. ఆ తర్వాత నుంచి స్థలం గురించి కార్యదర్శి ప్రసాద్‌ను సభ్యులు అడిగినప్పుడల్లా సానుకూల సమాధానం చెప్పి తప్పించుకునేవాడు. ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలుగా ఈ తతంగం జరుగుతున్నప్పటికీ సొసైటీ సభ్యులకు హైదరాబాద్‌లో స్థలం చూపించలేదు.
మళ్లీ వసూళ్ల పర్వం..
ఇటీవల రంగారెడ్డి జిల్లా కందుకూరి మండలం ముచ్చర్ల గ్రామంలోని సర్వే నంబర్ 288లో 204 ఎకరాల ప్రభుత్వ భూమిని సొసైటీకి ఇచ్చారని పేర్కొంటూ మరోమారు సింగరేణి నాలుగు జిల్లాల నుంచి సుమారు 1400 మంది వద్ద కొత్తగా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు.
ఒక్కొక్కరి వద్ద దరఖాస్తు ఫారానికి రూ.5 వేలు తీసుకున్నారు. పాత, కొత్త సభ్యుల నుంచి ప్రతీ ప్లాట్‌కు మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌కు రూ.14,450 చొప్పు న వసూలు చేయగా, సుమారు రూ.1.5 కోట్లు గోదావరిఖని సింగరేణి ఎస్‌బీహెచ్ శాఖలో ని ల్వ ఉన్నాయి. 2005లోనే సొసైటీ గౌరవాధ్యక్షుడిగా ఉన్న రమేష్‌కుమార్ ఆ పదవికి రాజీ నామా చేసినప్పటికీ ఆయన పేరు మాత్రం ఇంకా బ్యాంకు ఖాతాలో, సొసైటీ రిజిస్టర్‌లో కొనసాగుతోంది.
పాత సభ్యులకే ఇంటి స్థలం చూపించని సొసైటీ కొత్తవారికి ఆరునెలల్లో ఎలా చూపిస్తుందని భావించిన సొసైటీ సభ్యు డు జి.గోపి ఈ మేరకు వివరాలన్నీ సేకరించా రు. హైదరాబాద్‌లో నాల్గవ తరగతి ఉద్యోగుల బిల్డింగ్ సొసైటీ పేరుతో ఉన్న సంస్థకు సింగరేణి హౌస్ బిల్డింగ్ సొసైటీని అనుబంధంగా చేసి దాని నుంచి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని కార్యదర్శి, ఇతరులు నమ్మబలికారు.
కానీ స్థలాలు ఇవ్వకపోవడంతో బాధితుల నుంచి వ్యతిరేకత పెరిగింది. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో సొసైటీ నిర్వాహకులను బాధితులు ప్రశ్నించడంతో వారు తీసుకున్న డబ్బులను వాపసు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో సింగరేణియన్స్ హౌసింగ్ సొసైటీ పేరుతో ఎనిమిదేళ్లుగా జరుగుతున్నది మోసమనే నిర్ణయానికి బాధితులు వచ్చారు. సింగరేణి ఎస్‌బీహెచ్‌లో సొసైటీ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా లావాదేవీలను నిలిపివేయాలని సభ్యుడు గోపి బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ తతంగంపై ప్రశ్నించడంతో కొత్త సభ్యులను సొసైటీలోకి తీసుకోవడాన్ని నిర్వాహకులు నిలిపివేయడం గమనార్హం. గతంలో గోల్డెన్ ఫారెస్ట్, ఆగ్రోఫామ్స్, హార్టికల్చర్ పేరుతో సింగరేణి ఉద్యోగులను మోసం చేసి డబ్బులు దండుకున్న సంస్థల మాదిరిగానే సింగరేణియన్స్ హౌసింగ్ సొసైటీ సభ్యులను ముంచే సూచనలు కన్పిస్తున్నాయి.
మోసం చేయలేదు
: ఆర్‌వీఎస్‌ఆర్‌కే ప్రసాద్, సొసైటీ కార్యదర్శి
హౌసింగ్ సొసైటీలోని సభ్యులైన సింగరేణి కార్మికులకు ప్రభుత్వ స్థలాన్ని సబ్సిడీ ధరకు కేటాయించాలనేది సొసైటీ ప్రధాన ఆశయం. సొసైటీ సభ్యులలో హైదరాబాద్‌లో స్థలం కావాలని ఆప్షన్ ఇచ్చిన వారి నుంచి ప్లాట్ ఖరీదులో నిర్ణీత రుసుమును సొసైటీ కరెంట్ ఖాతాలో జమచేశాం. ఆ ఖాతాలో ఉన్న డబ్బును సర్వసభ్య సమావేశం అనుమతి లేకుండా మరో ఖాతాలోకి మార్చే ప్రయత్నం చేయలేదు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని ముచ్చెర్ల, సాయిరెడ్డిగూడెంలో ప్రభుత్వ స్థలం కేటాయింపు కోసం సభ్యులు చెల్లించిన డబ్బును ఎవరైనా తిరిగి వెనక్కి తీసుకోదలుచుకుంటే ఆయా ఏరియాలలోని సొసైటీ కో-ఆర్డినేటర్లను నవంబర్ 7వ తేదీలోపు కలిసి పూర్తి వివరాలను అందజేయాలి. ఆ తర్వాత వారి డబ్బులను సభ్యుల ఖాతాలలో జమచేస్తాం. సొసైటీ అధ్యక్షులుగా ఉన్న అప్పటి జీఎం రమేష్‌కుమార్ వ్యక్తిగత కారణాలతో ఆ పదవికి 2005లో రాజీనామా చేస్తే ఆయన స్థానంలో కొత్తగూడెం ఐఈడీ క్లర్క్ కె.శ్రీనివాసకుమార్‌ను అదే సంవత్సరం ఎన్నుకున్నాం. సొసైటీలోని సభ్యులైన సింగరేణి కార్మికులు నాల్గవ తరగతి సభ్యులు ఎలా అవుతారో త్వరలో వివరిస్తాం. ఈ విషయంలో సభ్యులను ఎలాంటి మోసాలకూ గురిచేయడం లేదు.
దోపిడీ సొసైటీ !
Published Wed, Oct 30 2013 3:47 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement