సాక్షి, హైదరాబాద్: ఒకవైపు ఏపీలో ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుండగా మరోవైపు బదిలీల ప్రక్రియను కొనసాగించడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఓటర్ల నమో దు ప్రక్రియతో సంబంధమున్న జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు అందరూ, మున్సిపల్ కమిషనర్ల బదిలీలపై ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 25వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ఓటర్ల జాబితా సవరణ, ఓటర్ల నమోదు ప్రక్రియతో సంబంధం ఉన్న ఏ ఉద్యోగి, అధికారి నైనా బదిలీ చేయాలంటే అందుకు తగిన కారణాలను వివరిస్తూ ముందస్తుగా కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంది.
ఈ మేరకు ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు గత నెల 20వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా ఆర్డీవోలు, మున్సిపాలిటీల మున్సిపల్ కమిషనర్లను బది లీలు చేయడంపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నిర్ణయించింది. ఓటర్ల జాబితా సవరణ, నమోదు ప్రక్రియకు సంబంధించిన అధికారులు, ఉద్యోగులను బదిలీలు చేస్తే ఆ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ‘సాక్షి’కి తెలిపారు.
ఇప్పటికే మున్సిపాలిటీలకు చెందిన 40 మంది మున్సిపల్ కమిషనర్ల బది లీలకు సంబంధించిన ఫైలును సంబంధిత శాఖ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపించింది. 13వ తేదీ నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్నందున బదిలీలపై నిషేధం ఉందని, అయినా మున్సిపల్ కమిషనర్ల బదిలీలకు కారణం ఏమిటో తెలియజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం మున్సిపల్ శాఖను కోరింది. మున్సిపల్ శాఖ నుంచి కారణాలు తెలియజేస్తూ సమాధానం వస్తే ఆ వివరాలన్నింటినీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం పంపనుంది.
ఓటర్ల నమోదు ప్రక్రియలోని ఉద్యోగుల బదిలీలు కుదరదు
Published Sun, Nov 16 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM