మచిలీపట్నం : జిల్లాలో ఉపాధి హామీ పనులు ఆశించిన మేర ముందుకుసాగడం లేదు. రబీలో పంటల సాగు లేకపోవడంతో లక్షల మంది కూలీలు పనులకోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించకపోవడంతో అవసరమైన వారందరికీ పనులు దొరకని పరిస్థితి నెలకొంది. పనులకు సంబంధించి గ్రామసభల్లో ప్రతిపాదనలు తయారుచేసినా అవి కలెక్టర్ ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలో పనులను ప్రారంభించే పరిస్థితి లేదు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.192.30 కోట్ల విలువైన పనులను ఉపాధి హామీ పథకంలో చేయాలని నిర్ణయించారు. 64.36 లక్షల పనిదినాలు కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు రూ.93.18 కోట్లు ఖర్చు చేసి 49.22 లక్షల పనిదినాలు కల్పించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
జిల్లాలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. దాళ్వా పంట లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పనులు అందుబాటులో లేవు. చేసేందుకు పని లేక కూలీలు ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రతి మండలంలో రోజుకు 300 నుంచి 400 మంది ఉపాధి పనులు చేస్తున్నారని అధికారులు చెబుతున్నా అందరికీ పని కల్పించలేని దుస్థితి ఏర్పడుతోంది.
ముందస్తు ప్రణాళిక లేకే..
జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో సాగునీటి కొరత ఏర్పడింది. పంటలు లేకపోవడంతో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికను రూపొందించలేదు. రెండు పంటలు సాగులో ఉంటే మార్చి నుంచి ఉపాధి పనులను ప్రారంభిస్తారు. ఇదే పద్ధతిని ఈ ఏడాదీ అమలు చేశారు. రబీకి సాగునీరు విడుదల చేయకపోవడంతో డిసెంబర్ నుంచే ఉపాధి పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. అయినా అధికారులు స్పందించ లేదు. పనులు ప్రారంభించిన మూడు వారాలకు కాని వేతనం కూలీల చేతికి అందని పరిస్థితి ఉంది. ప్రస్తుతం పనులు ప్రారంభించినా పనిచేసిన కూలీలకు వేతనం అందాలంటే మరో 20 రోజులకు పైబడి ఎదురుచూడాల్సిందే. ఉపాధి హామీ పనిలో పంటబోదెలను ఎనిమిది మీటర్ల పొడవు, ఒక మీటరు వెడల్పు, 20 సెంటీమీటర్ల లోతున మట్టి తీస్తే ఒక్కొక్క కూలీకి రూ.160 నుంచి రూ.190 వరకు వేతనంగా వచ్చే అవకాశం ఉంది. జాబ్ కార్డులు సిద్ధంగానే ఉన్నా.. పనుల కోసం కూలీలు ఎదురుచూస్తున్నా, పనులకు సంబంధించి ఆమోదం లేకపోవడంతో ఉపాధి పనులు మందకొడిగా సాగుతున్నాయి.
మొక్కల పెంపకం అంతంతమాత్రమే
ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 500 ఎకరాల్లో మామిడి, నిమ్మ, జామ తోటల పెంపకం చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వ స్థలాల్లోనే ఈ మొక్కల పెంపకం చేపట్టాలనే నిబంధన విధించారు. మొక్కలు ఇంత వరకు పంపిణీ కాలేదు. ఎప్పటికి ఈ లక్ష్యాన్ని చేరుకుంటారో తెలియని పరిస్థితి.
ఉపాధి ఊసేది!?
Published Thu, Feb 4 2016 1:54 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement