పంట రుణ లక్ష్యం 29,101 కోట్లు
⇒ ఖరారు చేసిన తెలంగాణ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ
⇒ ఖరీఫ్‌కు రూ.17,460 కోట్లు.. రబీకి రూ.11,640 కోట్లు
⇒ అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాకు రూ. 4,686 కోట్లు
⇒ మొత్తం రాష్ట్ర రుణ ప్రణాళిక లక్ష్యం రూ.90,776 కోట్లు
⇒ విద్య, గృహ రంగాలకు గతం కంటే తక్కువ రుణాలు
హైదరాబాద్: 2016-17 ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.29,101 కోట్ల పంట రుణాలివ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) నిర్ణయించింది. అందులో ఖరీఫ్‌కు రూ.17,460 కోట్లు, రబీకి రూ.11,640 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది పంట రుణాల లక్ష్యం రూ.27,800 కోట్లు కాగా.. ఈసారి కాస్త పెంచారు. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాకు రూ. 4,686 కోట్లు కేటాయించారు. ఇక వ్యవసాయ టర్మ్ రుణాలకు రూ.9,202 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2,708 కోట్లు కేటాయించారు. మొత్తంగా ఈ ఏడాది వ్యవసాయ రంగానికి రూ. 41,012 కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర బ్యాంకర్లు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 2016-17 తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళికను గురువారం జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విడుదల చేశారు. వ్యవసాయం సహా ఇతర అన్ని రంగాలకు కలిపి రాష్ట్ర రుణ ప్రణాళిక లక్ష్యం రూ.90,776 కోట్లుగా ఎస్‌ఎల్‌బీసీ ప్రకటించింది. గతేడాది రూ.78,776 కోట్లు కాగా.. ఈసారి 15.23 శాతం పెంచారు. మరోవైపు ఈసారి చిన్న మధ్యతరహా పరిశ్రమలకు, విద్య, గృహ రంగాలకు రుణాలను తగ్గించారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు గతేడాది రూ.11,020 కోట్లు కేటాయిస్తే... ఈసారి రూ.10,807 కోట్లకే పరిమితం చేశారు. గతేడాది విద్యా రుణాల లక్ష్యం రూ. 864 కోట్లు కాగా.. ఈసారి రూ.731 కోట్లకు తగ్గించారు. గతేడాది గృహ రుణాల లక్ష్యం రూ.2,306 కోట్లు కాగా.. ఈసారి రూ.2,189 కోట్లకు తగ్గించారు.
వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 2,185 కోట్లు
వ్యవసాయ టర్మ్ రుణాలు, సాగు అనుబంధ రంగాలకు రూ.11,911 రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న బ్యాంకర్లు వ్యవసాయానికి కూలీల కొరత కారణంగా వ్యవసాయ యాంత్రీకరణలో పెట్టుబడులు పెట్టే వారికి 2,185 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రీన్‌హౌస్, కూరగాయల సాగుకు రూ.2,082 కోట్లు కేటాయించారు. కోళ్ల పరిశ్రమకు రూ.788 కోట్లు కేటాయించారు. శ్వేత విప్లవానికి రూ.2,105 కోట్లు, గొర్రెలు, మేకలు, మత్స్య రంగాలకు రూ. 811 కోట్లు కేటాయించారు. కాగా, పంట రుణాల్లో అత్యధికంగా వరి సాగు చేసే రైతులకు రూ.12,740 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చిరుధాన్యాల సాగుకు రూ.1,366 కోట్లు, పప్పుధాన్యాల సాగుకు రూ.857 కోట్లు, పత్తి రైతులకు రూ.7,087 కోట్లు కేటాయించారు.