తొలివిడత ప్రాదేశిక ఎన్నికల ప్రచారానికి తెర పడింది. చివరి రోజుల ప్రచారాలతో హోరెత్తించిన పాలు పార్టీల అభ్యర్థులు శుక్రవారం సాయంత్రంతో ప్రచార పర్వానికి తెర దించి.. ప్రలోభాల పర్వానికి తెర తీశారు.
శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : తొలివిడత ప్రాదేశిక ఎన్నికల ప్రచారానికి తెర పడింది. చివరి రోజుల ప్రచారాలతో హోరెత్తించిన పాలు పార్టీల అభ్యర్థులు శుక్రవారం సాయంత్రంతో ప్రచార పర్వానికి తెర దించి.. ప్రలోభాల పర్వానికి తెర తీశారు. తొలి విడతలో జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 18 మండలాల్లో ఈ నెల ఆరో తేదీన పరిషత్ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మండలాల్లో 18 జెడ్పీటీసీలు, 317 ఎంపీటీసీలు ఉండగా ఒక జెడ్పీటీసీ, 14 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి.
మిగిలిన 17 జెడ్పీటీసీలు, 304 ఎంపీటీసీల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత పది రోజులుగా ప్రచారంతో హోరెత్తించి అభ్యర్థులు పోలిం గ్‌కు మరో రోజు గడువు ఉన్న నేపథ్యంలో చివరి ప్రయత్నాలు చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను వ్యక్తిగతంగా కలవడం, గ్రామాల్లో పట్టున్న స్థానిక నేతలను మచ్చిక చేసుకోవడం ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ ఓట్లు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా లోపాయికారి ఒప్పందాలు, ఓటర్లను ప్రలోభపరచడం, డబ్బు, మద్యం మత్తులో ముంచెత్తడం వంటి చర్యలకు చాలా మంది అభ్యర్థులు పాల్పడుతున్నారు.
కాగా ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్ అభ్యర్థులు చాలా చోట్ల కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారు. పరస్పర సహకారంతో ఓట్లు కొల్లగొట్టడానికి పన్నాగాలు పన్నుతున్నారు. ఈ ఎన్నికల్లో సుమారు 70 శాతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టుకోలేని కాంగ్రెస్ పార్టీ ఆయా స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకు సహకరిస్తోంది. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను ఒంటరిగా ఎదుర్కొలేక సతమతమవుతున్న టీడీపీ అభ్యర్థులు సైతం కాంగ్రెస్ సహకారాన్ని అందిపుచ్చుకోవడంతోపాటు ఓటర్ల ను ప్రలోభ పెట్టే చర్యలకు, బెదిరింపులు, ఒత్తిళ్లకు సైతం తెగబడుతున్నారు. అనేక గ్రామాల్లో ఆ పార్టీ అభ్యర్థులు మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు.
ఇప్పటికే రెండు చోట్ల ఇలా పంపిణీ చేస్తున్న వారు పట్టుపడడమే ఇం దుకు నిదర్శనం. కొన్ని చోట్ల చీరలు, గృహోపకరణాలు వంటివి పంచేందుకు కూడా టీడీపీ అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి ఇది మరింత తీవ్రమయ్యే పరిస్థితి నెలకొంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులు మాత్రం జిల్లాలో జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన పర్యటనకు విశేష స్పందన రావడంతో రెట్టింపు ఉత్సాహంతో ప్రచారం చేసి ముగించారు. పోలింగ్ ఏజెంట్ల నియామకం వంటి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎక్కువగా ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.