శీతల గిడ్డంగిలో నిల్వచేసి పట్టించుకోని అధికారులు
ఎందుకూ పనికిరాకుండా పోయిన చింతపండు
నిర్లక్ష్యం ఖరీదు రూ. కోటి
భారం సేల్స్‌మెన్‌పై మోపేందుకు {పయత్నాలు
చింతపల్లి: తప్పు ఒకరు చేసి శిక్ష మరొకరికి వేస్తామన్న చందంగా గిరిజన సహకార సంస్థ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఏజెన్సీ 11 మండలాల్లో చింతపండు కొనుగోలుకు సేల్స్‌మెన్‌కు లక్ష్యాలు నిర్దేశించారు. కొనుగోలు చేసిన చింతపండును సకాలంలో అమ్మకుండా కోల్డు స్టోరేజ్‌లో ఉంచారు. ఏడాది తరువాత ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఆ భారం సేల్స్‌మెన్‌పై రుద్దేందుకు తాజాగా రంగం సిద్ధం చేస్తున్నారు. కొనుగోలు చేసిన ఒక్కో సేల్స్‌మేన్‌పై రూ.లక్షల్లో భారం పడనుంది. దీంతో బాధిత సేల్స్‌మెన్లు లబోదిబో మంటున్నారు. గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయడంలో భాగంగా గత ఏడాది కిలో చింతపండు ధర రూ.22 నిర్ణయించారు. ఈ మేరకు లక్ష్యాలను నిర్దేశించి కొనుగోలు బాధ్యతలు శ్యాండిఇన్‌స్పెక్టర్లు, సేల్స్‌మెన్‌కు అప్పగించారు. జీసీసీ కొనుగోలు చేసిన చింతపండును నాణ్యంగా తయారుచేసి తిరుపతి, అన్నవరం, సింహాచలం వంటి ప్రముఖ దేవస్థానాలతో పాటు మన్యంలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సుమారు రూ. 48 లక్షలు విలువ చేసే 250 టన్నుల చింతపండును కొనుగోలు చేశారు. సరుకు రవాణా, కోల్డ్‌స్టోరేజ్ అద్దెలు కలుపుకుని ఏడాదికి దాదాపు రూ.కోటి ఖర్చయినట్లు అధికారుల లెక్కల్లో తేలింది. కిలో రూ. 22కు కొనుగోలు చేసిన తరువాత భయట మార్కెట్‌లో ధరలు బాగా పెరిగాయి. వ్యాపారులు రూ.29కి కొనుగోలు చేసేవారు. అప్పట్లో చాలా మంది సేల్స్‌మెన్ బయట మార్కెట్‌లో అమ్ముదామని అధికారులకు సలహా ఇచ్చినా వారు అంగీకరించ లేదు. మరింత లాభాలు సాధించవచ్చని ఆశించారు.
సరుకు నిల్వలో నిర్లక్ష్యం
అంతవరకు బాగానే ఉన్నా కొన్న సరుకును భద్రపరిచే విషయంలో నిర్లక్ష్యం వహించారు. అనకాపల్లిలోని ప్రైవేటు కోల్డు స్టోరేజ్‌లో భద్రపరిచిన అధికారులు ఆ తరువాత దాని బాగోగులు పట్టించుకోలేదు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా చింతపండు నిల్వలకు అవసరమైన ఏసీని అందించలేదు. దీంతో నిల్వచేసిన చింతపండంతా ఎందుకూ పనికిరాకుండా పోయింది. నెలకు సుమారు రూ.60 వేల అద్దె చెల్లించిన అధికారులు నిల్వ చేసిన చింతపండు ఎలా ఉందో నెలకు ఒకసారి కూడా వెళ్లి చూడక పోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని సేల్స్‌మెన్‌లు వాపోతున్నారు. పైగా తాము అప్పగించిన సరుకు బదులు వేరే సరుకు నిల్వ కేంద్రాల్లో ఉందని చెబుతున్నారు. దీనిపై సంబంధిత కోల్డ్‌స్టోరేజ్ సిబ్బందిని ప్రశ్నిస్తే చాలా మంది సరుకులు నిల్వ చేసుకుంటారని, ఎవరి సరుకులు వారు చూసుకోవాలని సమాధానం చెబుతున్నారన్నారు. జరిగిన నష్టం పూడ్చుకునేందుకు జీతల్లో కోత విధించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సేల్స్‌మెన్‌లు చెబుతున్నారు. అదే జరిగితే తాము కోర్టును ఆశ్రయిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. పాడైన చింతపండు తీసుకెళ్లి పాడేయాలన్నా మరో ఐదారు లక్షల రూపాయలు ఖర్చవుతుంది.
జీసీసీకి చింత
Published Wed, Mar 16 2016 12:02 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement